ఆత్మహత్యపై నివేదిక సమర్ఫణ..
Ens Balu
4
కలెక్టరేట్
2020-10-12 15:36:55
అనంతపురం కలెక్టరేట్లో నార్పల మండలం గూగుడు గ్రామానికి చెందిన ఎన్. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై డీఆర్డీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ తో ఆరా తీసి, నివేదికను సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. ఈ మేరకు డిఆర్డిఎ పిడి నర్సింహారెడ్డి వాస్తవ నివేదిక ను సమర్పించారు. పీడీ కథనం మేరకు.. నార్పల మండలం గూగుడు గ్రామం లో ఆంజనేయస్వామి సంఘం- 2 లో ఆత్మహత్య చేసుకున్న ఎన్.రాజశేఖర్ రెడ్డి తల్లి ఎన్.రామలక్ష్మి, భార్య అయిన ఎన్.రుక్మిణి ఇద్దరూ సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘానికి 21-06- 2017 లో ఐదు లక్షల రూపాయల రుణం మంజూరు అయింది.. ఈ మొత్తం లో గ్రూప్ లో ఉన్న పది మంది సభ్యులకు 50 వేల రూపాయల చొప్పున వాటా రాగా, అత్తా, కోడళ్లు అయిన ఎన్.రామలక్ష్మి, ఎన్.రుక్మిణి లు ఒకే ఇంట్లో ఉంటూ గ్రూప్ లో సభ్యులుగా ఉన్నందువలన ఇద్దరూ రుణం తీసుకుంటే తిరిగి చెల్లించడం కష్టమవుతుందని భావించి రామలక్ష్మి రుణం తీసుకోలేదు. రామలక్ష్మి రుణం తీసుకునేందుకు ఆసక్తి చూపనందున అదే సంఘంలోని సభ్యురాలు అయిన సి. లక్ష్మీదేవి అనే ఆమె తన వాటాగా వచ్చిన రూ.50 వేల రుణంతో పాటు రామలక్ష్మి రుణం రూ.50 వేలు కూడా కలుపుకుని లక్ష రూపాయల రుణం తీసుకుని, ఇందుకు సంబంధించిన రుణం వాయిదా మొత్తాలను ప్రతి నెల తిరిగి చెల్లిస్తోంది.. ఈ క్రమంలో ఈ ఏడాది 11 -09- 2020 తేదీన వైయస్సార్ ఆసరా పథకం కింద మొదటి విడత రుణమాఫీ కింద ఆంజనేయ స్వామి సంఘం - 2 బ్యాంకు ఖాతాలో 40,133 రూపాయల నగదు జమ అయింది..ఇందులో 4 వేల రూపాయల చొప్పున ప్రతి సంఘం సభ్యులకు చెల్లించారు. రామలక్ష్మి రుణం వాటా కూడా లక్ష్మీదేవి తీసుకుని తిరిగి చెల్లించినందున లక్ష్మీదేవికి రూ. 8 వేల రూపాయలు ఇచ్చారు. తన తల్లి రామలక్ష్మి కి 50 వేల రూపాయల రుణం వచ్చిందని, ఆమె రుణం తీసుకోకపోయినప్పటికీ ఆమె వాటాగా వచ్చిన 4 వేల రూపాయల నగదును ఇవ్వాలని మృతుడు ఎన్. రాజశేఖర్ రెడ్డి లక్ష్మీదేవి వద్దకు వెళ్లి పట్టుపట్టాడు.. కానీ తానే రుణం తీసుకుని, రుణం వాయిదా కూడా తానే తిరిగి చెల్లిస్తున్నాను, కనుక 4 వేల రూపాయలను ఇవ్వనని లక్ష్మీదేవి అతనికి తెలియజేసింది. తమకు డబ్బు ఇవ్వలేదనే కారణంతో ఎన్. రాజశేఖర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని డిఆర్డిఎ పిడి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించారు..