పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
3
Srikakulam
2020-10-12 18:21:50

అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు.  ప్రభుత్వం, ప్రతిపక్షం, అధికారయంత్రాంగం సమన్వయంతో కలిసి నడిస్తేనే సమగ్రమైన మంచి పాలన ప్రజలకు అందుతుందని అన్నారు.  సోమవారం జలుమూరు మండలం శ్రీముఖలింగం, సారవకోట మండలాల్లో జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీముఖలింగంలో ఆయన మాట్లాడుతూ పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ప్రభుత్వం భావించిందని అన్నారు. దానికి కొంత మంది వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే దానిని కూడా కోర్టుల వరకు తీసుకువెళ్లారని తద్వారా ఆలస్యం జరుగుతుందని అన్నారు.  పేద ప్రజల అవసరాల పట్ల సరైన దృష్టి ఉండాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల దగ్గరికే అనునిత్యం పరిపాలన అందుబాటులో ఉండేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ విధానం దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సారవకోటలో మాట్లాడుతూ ఒకప్పుడు తాను ఈ స్కూల్లోనే చదువుకున్నట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎవరికి ఏమిటి అవసరమో సక్రమంగా గుర్తించి వారికి సంక్షేమ పథకాలను  సమర్ధవంతంగా అందజేస్తున్నామని అన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థులకు విద్య కానుకలు ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేనే లేదన్నారు. ఈ విద్యా కానుకను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోర్, డిప్యూటీ డీఈఓ జి.పగడాలమ్మ, తహశీల్దారు రాజ్ మోహన్, ప్రత్యేక అధికారి నీలాద్రి, ఎంపీడీఓలు ఈశ్వరరావు, జి. శ్యామలకుమారి, తహశీల్దారు శ్రీనివాసరావు, స్థానికులు  కూర్మినాయుడు, రామకృష్ , మండే రాంబాబు, ఎం .శ్యామలరావు, మాజీ వైస్ ఎంపీపీ టి .ధనలక్ష్మి, అల్లాడ పీఏసీఎస్ అధ్యక్షుడు లుక్కా లక్ష్మణరావు, స్కూలు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుంటా సింహాచలం, తమ్మన్నగారి రమణ, ఐస్ రమణ, కె హరి ప్రసాద్, లాడి రమేష్, వాన గోపి తంగి మురళీకృష్ణ, ధర్మాన జగన్ తదితరులు పాల్గొన్నారు.