వర్షంలోనే కమీషనర్ సహాయక చర్యలు..
Ens Balu
3
చావులమదుం
2020-10-12 18:39:35
మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలో తుఫాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సత్వరమే సంరక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ వరద నీరు బ్లాక్ అయిన చోట్ల దగ్గరుండి మరీ పనులు చేయించారు.హోరున వర్షం కురుస్తున్నప్పటికీ వడివడిగా అడుగులు వేసుకుంటూ ముఖ్యమైన ప్రాంతాలను తిరిగి సత్వర చర్యలను పరిశీలించారు. అనంతరం 2, 3, 4, 5 జోన్ల లోని చావులమదుం, ఎర్రగడ్డ, షీలానగర్, గురుద్వారా జంక్షన్ తదితర ప్రాంతాలను పరిశీలించి అవసరం ఉన్నచోట యుద్ధ ప్రాతిపదికన మోటారులను ఉపయోగించి నీరు నిల్వలేకుండా చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా చావులమదుం వద్ద నీరు నిల్వలేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం నాల్గవ జోన్ లోని ఎర్రగడ్డను పరిశీలించి గడ్డలోని చెత్తను తొలగించి నీరు సముద్రంలోకి వెళ్ళే మార్గంను పోర్టు అధికారులతో సంప్రదించి తగుచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయిదవ జోన్ లోని షీలానగర్ వద్ద హరిజన జగ్గయ్యపాలెం ముంపునకు గురియైనందున యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ముంపుకు కారణమైన కల్వర్టును తాత్కాలికంగా తొలగించి, హైవేపైకి నీరు చేరకుండా, శాస్వత ప్రతిపాదనలను సిద్దం చేయాలని పర్యవేక్షక ఇంజినీరులను ఆదేశించారు. గురుద్వారా జంక్షన్ వద్ద ఈపీడీసీఎల్ చేపడుతున్న భూగర్భ కేబుల్ పనులలో భాగంగా కల్వర్టు కింద ఉన్న ఇసుక బస్తాల వలన నీరు హైవేపైకి చేరినందువల్ల వెంటనే ఇసుక బస్తాలను తొలగించి నీరు పోయే ఏర్పాటు చేయాలని, భూగర్భ కేబుల్ గుత్తేదారునికి జరిమానా విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్లు శ్రీనివాస రావు, బి. సన్యాసినాయుడు, పి. సింహాచలం, శ్రీధర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, పర్యవేక్షక ఇంజనీర్లు గణేష్ బాబు, శ్యాంసన్ రాజు, ఏ.ఎమ్.హెచ్.వో జయరాం, ఏ.సి.పి.లు అమ్మాజీ, హరిబాబు, కార్యనిర్వాహక ఇంజనీర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.