ఎరువుల అధిక నిల్వలపై కేసులు పెట్టండి..
Ens Balu
2
కలెక్టరేట్
2020-10-12 19:17:00
విజయనగరం జిల్లాలో అత్యధికంగా ఎరువులను కొనుగోలు చేసిన 20 మందికి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ జరిమానా విధించారు. అదేవిధంగా ఆగస్టు నెలలో కూడా నిబంధనలకు విరుద్దంగా, ఎరువులను ఈ-పోస్ విధానం ద్వారా అధికంగా కొనుగోలు చేసిన, విక్రయించిన వారిని గుర్తించి, ఆయా మండలాల వ్యవసాయాధికారుల సమక్షంలో కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్‌లో జాయింట్ కలెక్టర్ విచారించారు. అనుమతించిన పరిమితి కంటే అధికంగా ఎరువులను కొనుగోలు చేయడం, వినియోగించడం చట్టరీత్యా నేరమని ఈ సందర్భంగా జెసి స్పష్టం చేశారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన కొనుగోలు దారులు, డీర్లకు రూ.15వేలు నుంచి 20 వేలు వరకూ జరిమానా విధించారు. ఇకముందు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఎరువులను కొనుగోలు చేసినా, విక్రయించినా, వ్యవసాయేతర కార్యక్రమాలకు వినియోగించినా వారి లైసెన్సులను రద్దు చేయడమే కాకుండా, అత్యవసర సరుకుల చట్టం క్రింద, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జెసి హెచ్చరించారు. ఈ విచారణలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.ఆశాదేవి, డిప్యుటీ డైరెక్టర్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.