పోరాటాలతో పనిలేకుండానే సాగు హక్కులు..
Ens Balu
3
గుమ్మలక్ష్మీపురం
2020-10-13 15:19:54
ఏ పోరాటాలు చేయకుండా, ఎవరూ అడగకుండానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, అడగకుండానే అన్నీ ఇస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గిరిజనులను తన కుటుంబ సభ్యులుగా గౌరవిస్తున్నారని, అయితే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ల పాటు గిరిజనులకు కనీసం మంత్రి పదవిని కూడా ఇవ్వకుండా అవమానించారని విమర్శించారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో మంగళవారం కురుపాం నియోజకవర్గ స్థాయిలో గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్, డీకేటీ పట్టాలను ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, పార్వతీపురం ఐటీడీఏ పీఓ కూర్మనాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, కొండ కోనల్లో అడవిని నమ్ముకొని బతికే గిరిపుత్రలకు వారు సాగు చేసుకొనే భూములకు పట్టాలు లేక కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా గిరిజన పక్షపాతి అయిన అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 2008లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను ఇచ్చారని, వైయస్సార్ ను తన గుండెల్లో పెట్టుకొని గిరిజనుల పట్ల అదే ఆదరణతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తాను గిరిజన పక్షపాతి అని నిరూపించుకున్నారని చెప్పారు. ఆర్ఓఎఫ్ఆర్ పథకంలో పట్టాలు ఇచ్చే విషయంగా సీఎం నిర్వహించిన తొలి సమీక్షా సమావేశంలో అధికారులు ముందుగా 10 వేల మందికి 50 వేల ఎకరాలకు మాత్రమే పట్టాలను ఇస్తామని చెప్తే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదని తెలిపారు. ఆ తర్వాత నిర్వహించిన సమీక్షా సమావేశల్లో మళ్లీ 50 వేల మందికి లక్ష ఎకరాలను ఇస్తామన్నా ఒప్పుకోకుండా 3 లక్షల ఎకరాలు 1.5 లక్షల మందికి ఇవ్వాల్సిందే అని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పడంతో అక్టోబర్ 2న 1.65 లక్షల మందికి 3 లక్షల ఎకరాలకు పట్టాలను ఇవ్వగలిగామని వివరించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కోసం దరఖాస్తు చేసుకొనే గిరిజనులకు అన్ని అర్హతలు ఉన్నా వారి దరఖాస్తులు తిరస్కరణకు గురికావడానికి కారణం వారు అటవీ భూముల్లో కాకుండా రెవెన్యూ భూములలో పోడు సాగు చేయడమేనని తెలుసుకున్న ముఖ్యమంత్రి రెవెన్యూ భూములలో సాగు చేసుకుంటున్న గిరిజనులకు కూడా డీకేటీ పట్టాలను ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కూడా జిల్లా వ్యాప్తంగా 25 వేల మందికి 45 వేల ఎకరాల దాకా పట్టాలను ఇవ్వడం జరుగుతోందన్నారు. కురుపాం నియోజకవర్గం 12429 మంది గిరిజనులకు లో 21 వేల ఎకరాలను పట్టాలుగా ఇవ్వడం జరుగుతోందని పుష్ప శ్రీవాణి వివరించారు. అయితే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా భూమి పట్టాలను అందించడం ఒక నామమాత్రపు కార్యక్రమం కాకూడదని, ఒక చిన్న కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి బతకాలంటే కనీసం 2 ఎకరాల భూమి ఉండాలని, అంతకంటే తక్కువ భూమి ఉంటే దానిపై వచ్చే ఆదాయం వారి జీవనావసరాలకు సరిపోయే అవకాశం లేదన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిప్రాయమని పుష్ప శ్రీవాణి చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఒక్కో గిరిజన కుటుంబానికి ఇచ్చే భూమి 2 ఎకరాలకు తక్కువ కాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇదివరకే 2 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన కుటుంబాలకు వారి భూమి 2 ఎకరాలకు తక్కువ కాకుండా ఉండేలా అదనంగా భూమి పట్టాలను ఇవ్వడం జరుగుతోందని విపులీకరించారు. ఇప్పుడు భూమి పట్టాలను అందుకుంటున్న గిరిజనులందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని వర్తంపజేయాలని కూడా సీఎం ఆదేశించారని తెలిపారు. టెలిఫోన్ సిగ్నల్ కూడా సరిగా ఉండని పాడేరులో 500 కోట్ల రుపాయలతో గిరిజన వైద్యకళాశాలను నిర్మాణాన్ని చేపట్టడం, మిగిలిన ఐటీడీఏలకు కూడా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను మంజూరు చేయడం, రాష్ట్రంలో మారుమూలన ఉన్న కురుపాం నియోజకవర్గంలో 153 కోట్ల రుపాయలతో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణాన్ని మంజూరు చేయడం గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు.
గిరిజనులను చంద్రబాబు అవమానించారు:
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనులు తన సొంత కుటుంబ సభ్యులని గౌరవిస్తే, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అనుచితమైన వ్యాఖ్యలతో గిరిజనులను అవమానించారని విమర్శించారు. తాను అధికారంలో కొనసాగిన ఐదేళ్ల కాలంలో సుమారు నాలుగురేళ్ల పాటు గిరిజనులకు తన మంత్రి వర్గంలో స్థానం కూడా ఇవ్వలేదని పుష్ప శ్రీవాణి ధ్వజమెత్తారు. గతంలో గిరిజనులకు, గిరిజన ప్రాంతాలకు ఏ అభివృద్ధి కావాలన్నా పోరాటాలు చేయాల్సి వచ్చేదని ప్రస్తావించారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరూ ఎలాంటి పోరాటాలు చేయకుండానే, ఎవరూ అడగకుండానే గిరిజనులను, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని కితాబిచ్చారు.