అదనపు ఆయకట్టు అభివ్రుద్ధి..
Ens Balu
1
Srikakulam
2020-10-13 18:50:07
శ్రీకాకుళం జిల్లాలో అదనపు ఆయకట్టు అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. చిన్న భూ సేకరణ సమస్యలు వలన ఆయకట్టు అభివృద్ధి ఆలస్యం జరగరాదని ఆయన పేర్కొన్నారు. వంశధార ప్రాంతంలో కొత్తూరు, భామిని మండలాలు, తోటపల్లి ప్రాజెక్టు క్రింద, హెచ్.ఎల్.సి క్రింద ఆయకట్టు అభివృద్ధి కావాలని ఆయన అన్నారు. అదనపు ఆయకట్టు, భూ సేకరణ పై కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. హెచ్.ఎల్.సిని డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఇంజినీర్లు పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అన్నారు. భూ సేకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగరాదని ఆయన ఎస్డీసి లను ఆదేశించారు. తోటపల్లి ప్రాజెక్టు క్రింద 27 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందాలని అందుకు అవసరమైన భూ సేకరణ వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వంశధార ఎస్ఇ డోల తిరుమల రావు మాట్లాడుతూ హై లెవెల్ కెనాల్ ద్వారా 5 వేల ఎకరాలను స్థిరీకరణతో పాటు కొత్తగా 15 వేల ఎకరాలకు ప్రతిపాదనలు పెట్టామన్నారు. 5 వేల ఎకరాలకు 10 డిస్త్రిబ్యూటరీలు ఉన్నాయని చెప్పారు. 39 ఎకరాలు భూ సేకరణ కావలసి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, సర్వే సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, ఎస్డీసిలు బి.శాంతి, కాశీవిశ్వనాథ్, జి.సుజాత తదితరులు పాల్గొన్నారు.