ఆక్వా ప్రతిపాదనలు పరిశీలించాలి..


Ens Balu
2
Srikakulam
2020-10-13 18:54:31

శ్రీకాకుళం జిల్లాలో ఆక్వా పరిశ్రమ ఏర్పాటుకు వచ్చిన  ప్రతిపాదనలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లాలో ఆక్వా పరిశ్రమపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్షించారు. ఆక్వా పరిశ్రమ స్థాపనకు వచ్చిన దరఖాస్తులు వివరంగా పరిశీలించాలి. పరిశ్రమలకు ప్రతిపాదనలు వచ్చిన స్థలాల్లోను, సమీపంలోను తాగునీటి వసతులు, తదితర సౌకర్యాలు ఉంటే వాటికి కలిగే అవరోధాలు గుర్తించాలని ఆదేశించారు. కాలుష్యం ప్రభావం పరిశీలించాలని ఆయన అన్నారు. వినియోగించే ఆహార పదార్థాలు, ఆక్వా చెరువుల నుండి విడిచిపెట్టే నీటి మార్గాలు, తద్వారా కలిగే కాలుష్య ప్రభావం కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సంతబొమ్మాలి, కవిటి, పోలాకి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, గార, సోంపేట, వజ్రపు కొత్తూరు మండలాల్లో 73.35 హెక్టార్లలో 85 నూతన ఆక్వా పరిశ్రమలను ఏర్పాటు చేయుటకు, సంతబొమ్మాలి, పోలాకి, శ్రీకాకుళం మండలాల్లో 9.50 హెక్టార్లలో గల 10 ఆక్వా పరిశ్రమలను రెన్యూవల్ చేయుటకు జిల్లా స్థాయి కమిటీలో పరిశీలించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, మత్స్యశాఖ ఇన్ ఛార్జ్ సంయుక్త సంచాలకులు పివి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె. శ్రీధర్, కాలుష్య నియంత్రణ మండలి ఇఇ ఎస్.శంకర్ నాయక్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి జి.చక్రధర రావు, ఆక్వా పరిశ్రమల సంఘం ప్రతినిధి సురేంద్ర  తదితరులు పాల్గొన్నారు.