ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Ens Balu
1
Srikakulam
2020-10-13 19:01:02
శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని రాష్ట్ర శాసన సభాతి తమ్మినేని సీతారాం తెలిపారు. మంగళవారం ఆర్.అండ్.బి. అతిథి గృహంలో స్పీకర్ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, బుధవారం కూడా భారీ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కలెక్టర్లను, ఎస్.పి.లను, క్షేత్రస్థాయి శాఖాధికారులను, తహశీల్దారులను అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. వర్షాల కారణంగా పంటలు, ఇళ్ళు, పశువులకు నష్టం వాటిల్లినట్లయితే, వాటిని క్షుణ్ణంగా అంచనా వేయవలసినదిగా ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. రెవిన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, హౌసింగ్ తదితర శాఖలవారీగా నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందన్నారు. సముద్రతీర ప్రాంత ప్రజలను, మత్స్యకారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి, వారిని అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని తెలిపారు. పలాస, టెక్కలి రణస్థలం, లావేరు ప్రాంతాలలో తుఫాను నష్టం ఎక్కువగా వుంటుందన్నారు. వంశధార, నాగావళి, బహుద నదులలో వరద ఉధృతి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. సహాయక చర్యలను తక్షణమే చేపట్టడం జరుగుతుందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో వుండాలని ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంధవరపు సూరిబాబు పాల్గొన్నారు.