జర్నలిస్టుల సేవలు మరువలేనివి...
Ens Balu
0
కలెక్టరేట్
2020-10-13 19:18:12
కరోనా మహమ్మారిని నియంత్రించడంలో వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, ఇతర అధికారులతోపాటుగా పాత్రికేయులు కూడా అమూల్యమైన సేవలను అందించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ ప్రశంసించారు. ఐఆర్‌పిడబ్ల్యూఏ (ఇంటిగ్రేటెడ్ రూరల్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్), జిల్లా సమాచార, పౌర సంబంధాలశాఖ సంయుక్తంగా కోవిడ్-19 వారియర్స్‌కు కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా సన్మానించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాను సుమారు 48 రోజులపాటు గ్రీన్‌జోన్‌లో ఉంచినందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కరోనా విజృంభన కారణంగా మనకంటే పెద్ద దేశాలు, అభివృద్ది చెందిన దేశాలు అల్లాడిపోగా, మన దేశం, మన రాష్ట్రం సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయని చెప్పారు. ముఖ్యంగా కరోనాను కట్టడి చేయడంలో వైద్యులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బందితో పాటు పాత్రికేయులు కూడా గణనీయమైన సేవలను అందించారని అన్నారు. వ్యాధి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో కూడా వీరంతా ప్రాణాలకు తెగించి, ధైర్యంగా విధులను నిర్వహించారని కొనియాడారు. పాత్రికేయుల త్యాగాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి గుర్తించారని, కరోనా వల్ల మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారని వెళ్లడించారు. కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ, అలసత్వం పనికిరాదని అన్నారు. వేక్సిన్ వచ్చేవరకూ ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు కోవిడ్ వారియర్స్ కృషి చేయాలని శ్రీనాధ్ కోరారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ సమిష్టిగా కృషి చేయడం ద్వారా జిల్లాలో కరోనాను గణనీయంగా కట్టడి చేయగలిగామని అన్నారు. మొదట్లో 48 రోజులపాటు జిల్లాను గ్రీన్‌జోన్‌గా ఉంచడమే కాకుండా, వ్యాధి ప్రవేశించిన తరువాత కూడా, దాని వ్యాప్తిని అడ్డుకొనేందుకు మూడంచెల వ్యూహం, 7 స్టెప్స్ స్ట్రాటజీ, 10 కమాండ్‌మెంట్స్‌ను అమలుచేసి, దానిని సమర్థవంతంగా నిరోధించామని తెలిపారు. దీనివల్లే రాష్ట్రంలో అతితక్కువ కేసులు, అతి తక్కువ మరణాలతో విజయనగరం జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అయినప్పటికీ కొందరిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా పాజిటివ్ రేటు 3శాతానికి తగ్గిపోయిందని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వేక్సిన్ వచ్చేవరకూ ప్రతీఒక్కరూ తప్పనిసరిగా మాస్కును ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, చేతులను తరచూ శానిటైజర్ తో సుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగానే నమోదవుతున్నప్పటకీ, ఈ నెలాఖరునాటికి రోజువారీ సగటు కేసుల సంఖ్య వంద కంటే తక్కువకు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కరోనాపై పోరులో పాత్రికేయులు కూడా ఎంతో కీలక పాత్ర వహించారని కలెక్టర్ ప్రశంసించారు.
జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు డి.రమేష్ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ఇతర ప్రభుత్వ విభాగాలతోపాటు పాత్రికేయులు చేసిన కృషిని సైతం గుర్తించడం అభినందనీయమన్నారు. చాలామంది పాత్రికేయులు కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో కూడా ఎంతో ధైర్యంగా విధులను నిర్వహించారని కొనియాడారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్‌ను పరిచయం చేశారు. ఫొరమ్ ఫర్ బెటర్ విజయనగరం ప్రతినిధి డాక్టర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ కోవిడ్ పట్ల అలసత్వాన్ని చూపవద్దని కోరారు. మాస్కును ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంతోపాటుగా, వీలైనంతవరకూ మౌనంగా ఉండాలని సూచించారు. కోవిడ్ వారియర్స్‌గా గుర్తించిన డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందితోపాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను దుశ్వాలువలతో, జ్ఞాపికలతో సన్మానించారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ను జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ, ఎపి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తదితర సంఘాలు శాలువలతో, బొకేలతో సత్కరించాయి. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, నెహ్రూయువ కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్ విక్రమాధిత్య, ఐఆర్‌పిడబ్ల్యూఏ డైరెక్టర్ పికె ప్రకాశరావు, కేసలి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కేసలి అప్పారావు, సమాచార, పౌర సంబంధాలశాఖ విశ్రాంత డిప్యుటీ డైరెక్టర్ త్యాగరాజు, డివిజనల్ పిఆర్ఓలు ఎస్.జానకమ్మ, బాలమాన్‌సింగ్, వ్యాఖ్యాతగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.