సీఎం వైఎస్ జగన్ రైతు పక్షపాతి..
Ens Balu
4
కలెక్టరేట్
2020-10-13 19:25:36
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని భావించారని, రాష్ట్రంలో రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. మంగళవారం ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో సబ్సిడీ పప్పుశనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. తన 3648 కిలోమీటర్ల పాదయాత్ర లో రైతులు, మహిళలు, యువతీ యువకులు కలిసి జగన్ వద్ద బాధలు తెలపగా, వారిని ఆదుకునేందుకు, వారి సంక్షేమం కోసం జనరంజక, ప్రజారంజక పాలనను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం అందిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల అప్పులు ఉన్నా వాటిని తట్టుకుని ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మడమ తిప్పని వ్యక్తిగా సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, అధికారం చేపట్టిన వెంటనే పింఛన్ ను పెంచారన్నారు. ప్రజాసంక్షేమం కోసం వైయస్సార్ రైతు భరోసా, వైయస్సార్ వాహన మిత్ర, జగనన్న గోరుముద్ద, వైయస్సార్ కంటి వెలుగు, వైయస్సార్ విద్యా కానుక, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల కోసం వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, డ్వాక్రా మహిళలకు ఉన్న అప్పులు మాఫీ చేయడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరం కాలంలోనే 50 వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేశారన్నారు. పేదల కుటుంబాల్లో సంతోషం చూడాలని, అవినీతికి తావులేకుండా వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ను పెట్టామని, సచివాలయాల ద్వారా పది రోజుల్లోనే రేషన్ కార్డు, పెన్షన్ ని అందిస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది మహిళలకు ఇంటి పట్టాలను ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రైతుల సంక్షేమం కోసమే జగనన్న ఆరాటపడుతున్నారని, వారు కష్టపడకుండా నష్టపోకుండా వారిని సంతోష పెట్టాలని అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టారన్నారు. జిల్లాలో 850 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా మట్టి నమూనాల సేకరణ, అగ్రి ల్యాబ్స్, శీతల గిడ్డంగుల ఏర్పాటు, ఎలాంటి కష్టం లేకుండా ఇంటివద్దకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించే కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేయాలని, సిరులు పండించాలని దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హంద్రీనీవా కాల్వను పూర్తిచేసి కృష్ణా జలాలను జిల్లాకు తీసుకు వచ్చారన్నారు. ఇంతకుముందు 200 మంది రైతులు జిల్లాలో, రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా వారిని ముఖ్యమంత్రి పరామర్శించారని, వారి కుటుంబాలకు భరోసానిచ్చారన్నారు. తమ ప్రభుత్వం రైతులకు చేదోడువాదోడుగా ఉంటుందన్నారు. శనగ పంట ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇతర పంటలైన పొద్దుతిరుగుడు, ధనియాలు, పెసలు, మిర్చి, మొక్కజొన్న, జొన్న లాంటి పంటలు సాగు చేయాలన్నారు. సబ్సిడీ పప్పు శనగ విత్తనాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో 26 మండలాల్లో 212 రైతు భరోసా కేంద్రాల ద్వారా బయోమెట్రిక్ విధానంలో 68, 900 హెక్టార్లలో సాగు చేసే విధంగా 52 వేల క్వింటాళ్ళ పప్పుశనగ విత్తనాలను 30 శాతం రాయితీపై రిజిస్ట్రేషన్ మరియు డబ్బులు చెల్లించిన రైతులకు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. పప్పు శనగ విత్తన పంపిణీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎక్కువగా రైతులు పప్పు శనగ పంటను సాగు చేసి నష్టపోరాదని, ఇతర పంటలు సాగు చేయడం వల్ల లాభదాయకంగా ఉంటుందని, పప్పుశనగ పంట కన్నా ఇతర పంటలైన జొన్న, సజ్జ, మినుములు, కుసుమ, పొద్దుతిరుగుడు తదితర పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. హంద్రీనీవా ఫేజ్ - 1 కింద ఆయకట్టు పరిధిలో భూసేకరణ కార్యక్రమం 2-3 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హంద్రీ-నీవా కాలువలో 3,800 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా, 12 మీటర్ల నుంచి 19 -21 మీటర్లకు కాలువ వెడల్పును పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఉరవకొండ ప్రాంతంలోని రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. రైతులు బాగుపడాలని వారి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ పెంచారని, మద్ధతు ధర అందించేందుకు కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని, సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల కాలంలోనే 3,100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి పంటలకు మద్ధతు ధర కల్పించి మొక్కజొన్న, ఇతర పంటలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేశారన్నారు. రైతుల కోసం రైతు భరోసా కింద 13, 500 రూపాయలను అందిస్తూ వారికి ప్రభుత్వం అండగా నిలిచిందని, 20 - 30 వేల ఎకరాల్లో వర్షాల వల్ల పంటలు దెబ్బతినగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉచిత ఇన్సూరెన్స్ ను అమలు చేస్తున్నారని, పంట నిల్వ కోసం రైతు గోడౌన్ లు కడుతున్నారని, ప్రతి సచివాలయం కింద వ్యవసాయ అసిస్టెంట్లను ఏర్పాటు చేశారని, రాబోయే కాలంలో ప్రతి ఒక్క రైతుకు నష్టపోకుండా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉరవకొండ ప్రాంతంలో పప్పు శనగ పంట అత్యధికంగా పండిస్తారని, ఒకే పంటను అత్యధికంగా వేయడం వల్ల నష్టపోకుండా ప్రభుత్వం పంట మార్పిడి చేపట్టి జొన్న, పొద్దుతిరుగుడు, మిర్చి లాంటి పంటలు సాగుచేసేలా ప్రచారం చేపడుతోందని, ఇతర పంటలకు అవసరమైన ధరలు, వచ్చే లాభాలు, పంటలు ఎలా సాగు చేయాలి అనేది ప్రజలకు తెలియజేయాలన్నారు.
ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీ పప్పుశనగ విత్తనాలను మంత్రి, కలెక్టర్ లు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, డిఎస్పి ఉమా మహేశ్వర్ రెడ్డి, ఎడి ఏ పద్మజ, వ్యవసాయ అధికారి శశికళ, పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.