కిసాన్ రైలు రైతులకు మేలు..
Ens Balu
3
Anantapur
2020-10-13 20:34:55
కిసాన్ రైలు ద్వారా అనంతపురం నుంచి న్యూఢిల్లీకి తరలించే ఉద్యాన ఉత్పత్తుల రవాణా చార్జీలను సగానికి తగ్గించినట్లు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య స్పష్టం చేశారు. కిసాన్ రైలులో ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు సంబంధించి చార్జీలు అధికంగా ఉన్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ఎంపీలందరూ సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖల దృష్టికి తీసుకు వచ్చిన నేపథ్యంలో, కేంద్రం రవాణా చార్జీలను సగానికి తగ్గించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం సాయంత్రం ఉద్యానవన శాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి లతో కలిసి కిసాన్ రైల్ ద్వారా తరలించే అనంత ఉద్యాన ఉత్పత్తులకు రవాణా ఛార్జీల తగ్గించిన విషయమై ఆయన పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ కిసాన్ రైలు ద్వారా అనంతపురం నుంచి న్యూఢిల్లీ కి తరలించే ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఒక టన్నుకు రవాణా చార్జీల ద్వారా 5136/- రూపాయలను రైల్వే వారు వసూలు చేస్తున్నారని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లగా, అందులో రవాణా చార్జీలను 50 శాతం తగ్గించారన్నారు. ఇందుకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ తరఫున 6 నెలల వరకు రవాణా చార్జీల మొత్తాన్ని రైల్వేశాఖకు డిపాజిట్ చేస్తుందని తెలిపారు. దీంతో రైల్వేశాఖ మిగిలిన సగం రూ.2568/-ల మొత్తాన్ని మాత్రమే రైతుల నుంచి వసూలు చేస్తూ ఉద్యాన ఉత్పత్తులను ఢిల్లీకి తరలించడం జరుగుతుందన్నారు.
సెప్టెంబర్ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్రం మంత్రులతో కలిసి వర్చ్యువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఫ్లాగ్ ఆఫ్ చేసి కిసాన్ రైల్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. మొదటి కిసాన్ రైల్ ద్వారా 323 మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులను 14 వ్యాగిన్లలో పంపడం జరిగిందన్నారు. రెండోవిడత కిసాన్ రైల్ ద్వారా 240 మెట్రిక్ టన్నులను 12 వ్యాగిన్లలో పంపడం జరిగిందన్నారు. దేశీయ మార్కెట్లో అనంత ఉద్యానపంటలకు మంచి గిరాకీ ఉందన్నారు. ఇంతకు ముందు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండేదికాదని, ప్రస్తుతం కిసాన్ రైలు ద్వారా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తోందని, కిసాన్ రైల్ కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. పక్క జిల్లాల నుంచి రైతులు వచ్చి ఇక్కడి నుంచి పంట ఉత్పత్తులను ఢిల్లీ కి పంపుతున్నారన్నారు. అనంతరం హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, అనంతపురం జిల్లా కరువు జిల్లాగా ఉన్నదని, రాష్ట్రంలోని పార్లమెంటు సభ్యులు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జిల్లా కిసాన్ రైలు తీసుకురావడం జరిగిందన్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు మార్కెట్లో ఉన్న పరిస్థితులను కళ్లారా చూసి అక్కడి ఎమ్మెల్యే, ఎంపీలను కలిసి మాట్లాడడం జరిగిందన్నారు. హిందూపురం నుంచి వెళ్ళడానికి కిసాన్ ఉడాన్ పేరుతో ఫైట్స్ తీసుకు రావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు విడతల్లో అనంత ఉద్యాన ఉత్పత్తులను కిసాన్ రైలు ద్వారా ఢిల్లీ మార్కెట్ కు పంపించడం జరిగిందన్నారు. జిల్లా రైతులు నాణ్యమైన ఉద్యానవన పంటలను పండిస్తున్నారన్నారు. కిసాన్ రైలు ప్రారంభించడంతో అనంతపురం ఉద్యాన ఉత్పత్తుల ద్వారా జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. భవిష్యత్తులో ఇక్కడి పంట ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకుని రావడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. కిసాన్ రైలును అనంతపురం నుంచి న్యూఢిల్లీ పంపడంలో రైల్వే అధికారులను ఒప్పించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అనంతపురం జిల్లా పార్లమెంటు సభ్యులు కృషి మరువలేనిదని తెలిపారు. రైతులందరూ కిసాన్ రైలు సద్వినియోగం చేసుకోగలిగితే భవిష్యత్తులో అనంతపురం నుంచి టైం టేబుల్ ప్రకారం రైలు నడిపించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం స్థానిక శాసన సభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాలో అనంతపురం ఒకటి, ప్రస్తుతం ఎక్కువగా హార్టికల్చర్ ద్వారా పంటలను సాగు చేస్తున్నారన్నారు. అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో, జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అందరి సహకారంతో, జిల్లా నుంచి న్యూఢిల్లీకి కిసాన్ రైలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, ఉద్యానవన శాఖ డిడి పద్మలత, ఉద్యానవన శాఖ అధికారి సతీష్, తదితరులు పాల్గొన్నారు..