సీపీఎం ఆవిష్కరణను విజయవంతం చేయాలి..
Ens Balu
2
Jagadamba Centre
2020-10-14 13:15:09
భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ శత వార్షికోత్పవాల సందర్భంగా ఈనెల 17న పార్టీ శాఖలున్న అన్ని ప్రాంతాల్లోను, మండల కేంద్రాల్లోను జెండా ఆవిష్కరణలు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి కె.లోకనాధం పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ 1920లో తాష్కెంట్ నగరంలో ఏర్పడినదని, నాటి నుంచి నేటి వరకు దేశ స్వాతంత్య్రం కోసం, ప్రజల కోసం పోరాడిందని తెలిపారు. సామ్రాజ్యవాదం, దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించిందని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా అలుపెరగని పోరు సల్పుతోందని, భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తోందని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆటుపోట్లను, అతివాద, మితవాద విచ్ఛిన్నకర ధోరణులను తట్టుకుని నికరంగా నిలబడి కష్టజీవుల తరపున పోరాడుతోందని తెలిపారు. కార్మిక, కర్షక హక్కుల పరిరక్షణ కోసం నేటికీ కృషి చేస్తోందని, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఉందని గుర్తు చేశారు. నేడు దేశంలో కుల, మత, ప్రాంతీయ, విచ్ఛిన్న శక్తులు చెలరేగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని, 17న జెండా ఆవిష్కరణలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లోకనాధం కోరారు.