రైతు నమోదు బాధ్యత వి.ఎ.ఎలదే..
Ens Balu
3
Srikakulam
2020-10-14 14:08:50
రైతులు మద్యవర్తుల బారిన పడకుండా మద్ధతు ధర కల్పించేందుకు ఇకపై అన్ని రైతు భరోసా కేంద్రాలు రైతు సేవ కేంద్రాలుగా పనిచేయనున్నాయని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ( పి.ఎ.సి.యస్ ) సి.ఇ.ఓలు, కంప్యూటర్ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమం బుధవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 248 ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభం కానున్నాయని, ఈ ఏడాది నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రతీ రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉందని, రైతు నమోదు కార్యక్రమం గ్రామ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ( వి.ఎ.ఎ ) మాత్రమే రైతు భరోసా కేంద్రం వద్ద నమోదు చేయాలని తేల్చిచెప్పారు. ఇందుకు ఇ-పంట రిజిస్ట్రేషన్ ఇన్ ప్రొక్యూర్ మెంట్ సాఫ్ట్ వేర్ లో నమోదు చేయాల్సి ఉంటుందని జె.సి స్పష్టం చేసారు. రైతులకు మద్ధతు ధర, ఎఫ్.ఏ. క్యు. ప్రమాణములు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ రైతులకు అందించే విషయమై గ్రామాల్లో గ్రామ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. రైతుల అవగాహన కొరకు మద్ధతు ధర, నాణ్యత ప్రమాణములు, రైతు నమోదుకు కావలసిన పత్రాల వివరాల బ్యానర్లను ప్రతీ రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాల వద్ద ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రిజిష్టర్ అయిన పిదప రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని వివరించారు. శిక్షణకు హాజరైన ప్రతీ ఒక్కరూ ఆర్.బి.కెల ద్వారా ధాన్యం కొనుగోలుపై పూర్తి అవగాహన చేసుకోవాలని, బుధవారం నుండి ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు శనివారం వరకు కొనసాగుతాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరమైన సందేహాలను నివృత్తి చేసుకోవాలని, మీరు అందించే సేవలు వలన జిల్లాలో ఏ ఒక్క రైతు నష్టపోరాదనే విషయాన్ని గుర్తెరగాలని జె.సి స్పష్టం చేసారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, పౌర సరఫరాల అధికారి , పి.ఏ.సి.ఎస్ సి.ఇ.ఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.