రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది..


Ens Balu
2
Srikakulam
2020-10-14 14:18:30

వర్షాలు, వరదలకు నష్టపోయన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అన్నారు. బుధ వారం రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి వరదలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాల్గొన్న ఉప ముఖ్య మంత్రి మీడియాతో మాట్లాడుతూ వర్షాలు, వరదలపట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసామని ఆయన పేర్కొన్నారు. తద్వారా అధిక నష్టం సంభవించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించి వరదల పరిస్ధితిని సమీక్షించారని పేర్కొంటూ నివేదికలను త్వరితగతిన సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. వరదలలో దురదృష్టవశాత్తు రాష్ట్రంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ ఇబ్బందులకు గురికారదనే ఉద్దేశ్యంతో అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని ముఖ్య మంత్రి ఆదేశించారని ఆయన చెప్పారు. వరదల అనంతరం ఎక్కడా పారిశుధ్య సమస్య, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఉప ముఖ్య మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ, ఆర్ అండ్ బి రహదారులు కొన్ని దెబ్బతిన్నాయని, వాటిని తక్షణం పునరుద్దరణకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగిందని క్రిష్ణదాస్ చెప్పారు. పంటల నష్టంపై రెండు, మూడు రోజుల్లో పూర్తి స్దాయి నివేదికలు సమర్పంచాలని ఆదేశించినట్లు తెలిపారు. వరద నీటిని భవిష్యత్తు అవసరాలకు వినియోగించే విధంగా చెరువులు నింపుటకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్య మంత్రి సూచనల చేసారని తెలిపారు. కాగా.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కరోనా వైరస్ నుండి రక్షణ పొందాలని ఉప ముఖ్య మంత్రి క్రిష్ణదాస్ పిలుపునిచ్చారు. మాస్కు వైరస్ కు రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని అన్నారు. మాస్కు లేకుండా బయటకు వెళ్ళరాదని ఆయన విజ్ఞప్తి చేసారు. కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ రెండవ దశ ప్రారంభం అయినట్లు వచ్చిన వార్తల పట్ల ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ ప్రజలకు మాస్కు సందేశాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కు ధరించాలని కోరారు..