నవరాత్రి మండపాలకు అనుమతి లేదు..
Ens Balu
2
Srikakulam
2020-10-14 14:37:20
శ్రీకాకుళం జిల్లాలో దసరా నవరాత్రి మండపాలకు అనుమతులు లేవని జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేసారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ తో కలసి మీడియాతో మాట్లాడుతూ కరోనా దృష్ట్యా వినాయక చవితికి మండపాలకు అనుమతులు ఇవ్వలేదని, అదేవిధంగా దసరా నవరాత్రుల మండపాలకు కూడా అనుమతులు ఇవ్వడం లేదన్నారు. కరోనా వైరస్ నివారణకు జిల్లాలో అనేక చర్యలు తీసుకున్నామని తద్వారా ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని కలెక్టర్ అన్నారు. అయితే కేరళ వంటి రాష్ట్రాల్లో రెండవ దశ ప్రారంభమై దేశంలోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్న పరిస్ధితిని గమనిస్తున్నామని ఆయన పేర్కొంటూ అటువంటి పరిస్ధితి జిల్లాలో తలెత్తకుండా ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆయన అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిలోనే ఉందని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని చెప్పారు. మాస్కు లేకుండా బయటకు రావద్దని హితవు పలికారు. కరోనా భారీన పడకుండా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు వెంటనే పరీక్షలు నిర్వహించుకొనుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దసరా సందర్భంగా ఆలయాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనానికి అనుమతిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రజలు తమ కుటుంబాల సంక్షేమం, ఆరోగ్యం దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈఅయ్యప్ప స్వామి విగ్రహం 40 సంవత్సరాలదే : సారవకోట మండలం కోదఅడ్డపనస గ్రామం వద్ద బయల్పడిన అయ్యప్ప స్వామి విగ్రహం 40 సంవత్సరాల క్రితం ప్రతిష్టించినదేనని పురావస్తు శాఖ అధికారులు తెలియజేసారని జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. భక్తులు తండోపతండాలుగా వెళుతున్నారని, కరోనా ప్రభావాన్ని గమనించాలని కోరారు. విగ్రహం పురాతనమైనది కాదని గమనించాలని చెప్పారు. ఆ ప్రదేశం అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు మండపాలకు తావులేదన్నారు. ఆలయ కమిటీలు ఎక్కడా రద్దీ లేకుండా చూడాలని, రద్దీ ఎక్కువ అవుతున్నప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు..