నిలకడగా బహుదా నీటిమట్టం..
Ens Balu
2
కలెక్టరేట్
2020-10-14 15:05:49
శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు, వరదల వలన అపాయకర పరిస్ధితి లేదని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ వంశధారలో 40 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నందున మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసామన్నారు. నాగావళి నదిలో 40 వేల క్యూసెక్కులు, మడ్డువలస రిజర్వాయర్ నుండి 23 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అన్నారు. వీటి పరిధిలో ఎక్కడా నీరు నిలిచిన పరిస్థితి లేదన్నారు. బహుదా నదిలో 28 వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తోందని, 40 వేల క్యూసెక్కుల నీరు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామన్నారు. 55 వేల క్యూసెక్కుల నీరు వస్తే హైవైపై రాకపోకలకు అంతరాయం కలగవచ్చని చెప్పారు. దీనిపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఆయన వివరించారు. ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో 19 వందల హెక్టార్లలో పంట నీట మునిగిందని, అయితే వరద నీరు తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో నీరు తగ్గిన తరువాత నష్టం పరిస్ధితి తెలుస్తుందని చెప్పారు. వంద ఎకరాల్లో ఉద్యానవన పంటలు కొంత నష్టపోయినట్లు తెలుస్తుందని, 18 ఇళ్ళు, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి రహదారులు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. వీటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. మెలియాపుట్టి మండలం గోకర్ణపురంకు చెందిన ఎవ్వారి శ్రీనివాసరావు వరద కారణంగా మరణించారని ఆయన తెలిపారు.