ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు..


Ens Balu
6
Srikakulam
2020-10-14 19:13:55

ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు.   బుధవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృధ్ధి సలహా సంఘం తొలి  సమావేశం చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆధ్వర్యంలో జరిగింది.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ, కరోనా నేపధ్యంలో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ తో సహా ప్రతీ ఒక్కరూ మంచి సేవలందించారని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగిందని, ఇది అభినందనీయమని అన్నారు.  ఇదే స్ఫూర్తితో నాన్-కోవిడ్ పేషెంట్లకూ వైద్యం అందించాలని తెలిపారు. నిరుపేదలతో పాటు మధ్యతరగతి ప్రజలు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలకు రావాలన్నారు.   అనంతరం కో-చైర్మన్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అట్టడుగు వర్గాల ప్రజలపై ప్రత్యేక శ్రధ్ధ వహిస్తున్నారని తెలిపారు.  మన జిల్లాలో మన కలెక్టర్ జె.నివాస్ కోవిడ్ సమయంలో అత్యంత శ్రధ్ధతో పని చేసి విజయవంతంగా కోవిడ్ ను ఎదుర్కోవడం  అభినందనీయమన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి సేవలను అందించడం జరుగుతున్నదని, ఆసుపత్రిని మరింతగా అభవృధ్ధి పరచవలసిన ఆవశ్యకత వుందన్నారు. ఇందుకు  ఆసుపత్రి అభివృధ్ధి కమిటీ తగు సూచనలు, సలహాలను అందించడం జరుగుతుందని తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు, మంచి సౌకర్యాలు, చక్కటి ఎక్విప్ మెంటు వుంటాయని తెలిపారు.  ప్రైవేటు ఆసుపత్రుల కంటె ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం సురక్షితమని, జిల్లావాసులు  ప్రభుత్వ ఆసుపత్రులను వుపయోగించుకోవాలని కోరారు. డెలివరీలతో పాటు ఆసుపత్రిలో లేప్రోస్కోప్, ఆర్థో, ఇ.ఎన్.టి, ఎండోస్కోప్,  గైనిక్ కు సంబంధించిన అనేక సర్జరీలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతున్నదని ప్రజలు సద్వినియోగ పరచుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో  హెల్ప్ డెస్క్ ద్వారా  పేషెంట్లను గైడ్ చేయాలన్నారు.          ఎం.వి.పద్మావతి మాట్లాడుతూ  జిల్లా నలుమూలల నుండి నిరుపేద ప్రజానీకం వైద్య సేవలకోసం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుందని, వారికి ఏ, ఏ విభాగాలలో ఏ ఏ సేవలు అందుతాయి వంటి వివరాలు తెలపడానికి సిబ్బందిని అందుబాటులో వుంచాలన్నారు. పారిశుధ్ధ్యంపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలని, ఆసుపత్రిని పరిశుభ్రంగా నిర్వహించాలని తెలిపారు. ఆసుపత్రి నిధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఆసుపత్రికి ప్రత్యేక నీటి సదుపాయాన్ని కలుగచేయాలని, ఇందుకు సంబంధించి రెండు ట్యాంకులు ఏర్పాటు చేయాలని తెలిపారు. కెప్టెన్ జగదీష్ మాట్లాడుతూ ఆసుపత్రికి పేషెంట్లతో పాటు వచ్చిన వారికి ఎకామడేషన్ సదుపాయం కలుగచేయాలన్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన  సేఫ్టీ, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, పాము కాటు మందులు (ఎంటీ వీనమ్ డోస్ లు ) అందుబాటులో వుంచాలని సూచించారు.  లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను ప్రజలకు విస్తృతంగా తెలియచేయాలన్నారు.  సానిటేషన్ పై పర్యవేక్షణ చేసి, మంచి వాతావరణాన్ని కలుగచేయాలన్నారు. పేషెంట్లతో మంచి స్నేహపూర్వకంగా మెలగాలని, అవసరమైన వారికి ట్రైసైకిళ్ళను ఇవ్వాలని, తాను ఒత ట్రైసైకిల్ ను డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ సమావేశంలో సభ్యులు వి.విజయ కుమార్, ఎల్.హేమ సుందర రావు, మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా.ఎ.కృష్ణవేణి, రిమ్స్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ. బి.ఎన్.ప్రసాద్, డి.సి.హెచ్.ఎస్. బి.సూర్యారావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.కె.సి.నాయక్, డా.అరవింద్,   ఎం,హెచ్.ఓ. వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.