భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ లు


Ens Balu
5
కలెక్టరేట్
2020-10-14 19:27:19

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనంతపురం కలెక్టరేట్ లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగినా ప్రాణహాని జరిగినా.. ఆపదలో ఉన్నా , ఏ సమస్య వచ్చినా వెంటనే కంట్రోల్ రూమ్ లోని 08554 - 220009, 8500292992 అనే నెంబర్లకు కాల్ చేయవచ్చన్నారు. ఫోన్ చేసిన వెంటనే స్పందించి డిజాస్టర్ రెస్పాన్స్ టీం ను సంబంధిత ప్రాంతానికి పంపి రక్షణ చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో     ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు, విద్యుత్ తీగల కింద, విద్యుత్ స్తంభాల పక్కన ఉండకుండా దూరంగా ఉండాలన్నారు. వర్షం పడే సమయంలో చెట్లపై పిడుగు పడే అవకాశాలు ఉన్నందున చెట్ల కింద ఉండరాదన్నారు. అలాగే పశువులు ఆరుబయట తిరిగేటపుడు కూడా  సురక్షితంగా వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండేలా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.