ఆదర్శంగా ఎస్.బి.ఐ.విజయవనం..
Ens Balu
6
ఎస్బీఐ వనం
2020-10-14 19:38:35
విజయనగరం, సిటీలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పచ్చదనం పెంచేందుకు కంటోన్మెంట్ లోని ఎస్.బి.ఐ. ప్రాంతీయ బిజినెస్ ఆఫీసులోని విజయవనం పార్కును ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. ఇక్కడి ఎస్‌బిఐ విజయవనం పార్కును కలెక్టర్ బుధవారం ఉదయం సందర్శించి కోనాకార్పస్ మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ తో పాటు భారతీయ స్టేట్ బ్యాంకు అధికారులు, నగరానికి చెందిన హరిత విజయనగరం సభ్యులంతా కలసి బ్రాంచి ఆవరణలో దాదాపు 88 మొక్కలు నాటారు. మొక్కలు నాటడంతోపాటు వాటిని పెంచేందుకు, ఆవరణను అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో కృషిచేసిన బ్యాంకు అధికారులను కలెక్టర్ అభినందించారు. విజయనగరం చరిత్ర, సంస్కృతిని తెలిపే విధంగా ఇక్కడి పార్కులో ఏర్పాటుచేసిన చిత్రాలను కలెక్టర్ పరిశీలించి కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇదే తరహాలో జిల్లా చారిత్రక ప్రాధాన్యతను చాటిచెప్పే చిత్రాల ఏర్పాటులో సహకరించాలని బ్యాంకు అధికారులను కోరారు. గత ఏడాది ఇదే క్యాంపస్‌ను సందర్శించిన నాడు ఉన్న పరిస్థితికి నేటి పరిస్థితికి ఎంతో తేడా వుందని పేర్కొంటూ ఆరోజు నాటిన మొక్కలన్నీ చెట్లుగా రూపొందడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్.బి.ఐ. ప్రాంతీయ మేనేజర్ రామ్మోహనరావు, చీఫ్ మేనేజర్ మూర్తి, దొర, గుప్తా, మల్లికార్జున, హరిత విజయనగరం బృందంలోని పోలీసు శిక్షణ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మెహెర్‌బాబా, సామాజిక అటవీ అధికారి జానకిరాం, కోఆర్డినేటర్ రామ్మోహన్, డా.వెంకటేశ్వరరావు, మునిసిపల్ ఇంజనీర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.