నూతన పారిశ్రామిక వేత్తలకు అశకాశం..
Ens Balu
3
కలెక్టరేట్
2020-10-14 19:47:34
విజయనగరం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పెట్టుబడి దారులకు ఏయే డాక్యుమెంట్లు సమర్పించాలో తెలియజేసి, వాటిని సమర్పించేందుకు తగిన సమయం ఇచ్చి అవి గడువులోగా సమర్పించని పక్షంలోనే తిరస్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. పరిశ్రమల కోసం దరఖాస్తు చేసిన వారికి ఏయే పత్రాలు సమర్పించాలో ముందుగానే సంబంధిత శాఖల అధికారులు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పరిశ్రమలకు ప్రోత్సాహకర వాతావరణ ఏర్పరచాలంటే అధికారులంతా పరిశ్రమల ఏర్పాటు పట్ల, పెట్టుబడిదారుల పట్ల సానుకూల వైఖరి కలిగి వుండాలని సూచించారు. జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశం కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధ్యక్షతన బుధవారం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కోట ప్రసాదరావు మాట్లాడుతూ దీనిని పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంగా మార్పు చేసినట్లు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఏకగవాక్ష విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన 192 దరఖాస్తుల్లో 172 పరిశ్రమలకు ఆమోదం ఇవ్వడం జరిగిందని, 15 దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పెండింగులో ఉన్నాయని, మరో ఐదు దరఖాస్తులను పలు శాఖలు తిరస్కరించాయని జి.ఎం. వివరించారు. దీనిపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ దరఖాస్తులు పెండింగ్‌లో వుంచిన వి.ఎం.ఆర్.డి.ఏ., కాలుష్య నియంత్రణ మండలి, తూనికలు, కొలతల శాఖల నుండి వివరణ కోరారు. ఏయే కారణాల వల్ల దరఖాస్తులను తిరస్కరించారన్న అంశాన్ని తెలుసుకున్నారు. 78 పారిశ్రామిక సంస్థల నుండి రాయితీలు మంజూరుకోసం దరఖాస్తులు వచ్చాయన్నఅంశాన్ని పరిశ్రమల కేంద్రం జి.ఎం. వివరించగా అర్హత ఉన్న సంస్థలన్నింటికీ మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకొన్న పలువురు ఔత్సాహికులతో కలెక్టర్ ఫోనులో మాట్లాడించి ఏ కారణంతో వారు పూర్తిస్థాయిలో దరఖాస్తులు అందజేయలేకపోయారో తెలుసుకున్నారు. సమగ్ర పారిశ్రామిక సర్వే నిర్వహణకు మునిసిపల్ కమిషనర్ల సహకారం తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు పర్యవేక్షణలో సర్వే నిర్వహించాలని సూచించారు. పారిశ్రామిక భద్రత, ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ వుండరాదని కలెక్టర్ స్పష్టంచేశారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీల మంజూరుపై కూడా కలెక్టర్ సమీక్షించారు. పారిశ్రామిక భద్రతపై ఆయా పరిశ్రమల తనిఖీకి జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ జిల్లాలోని 45 భద్రతాపరంగా ప్రమాదకర పరిశ్రమలను తనిఖీ చేసిందని పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వివరించారు. వీటిలో 12 పరిశ్రమలు తమ సంస్థల్లో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై నివేదికలు అందజేశాయన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, పరిశ్రమల శాఖ అధికారులు పాపారావు, రమణ, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.