కులమతాల బేధం లేకుండా నడుచుకోవాలి..


Ens Balu
4
కలెక్టరేట్
2020-10-14 20:35:01

విజయనగరం జిల్లాలోని అని వర్గాల ప్రజలూ కులమత, వర్గ భేదం లేకుండా సోదరభావంతో మెలగాలని అప్పుడే శాంతి నెలకొంటుందని.. దాని ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. ఎస్సీ,ఎస్టీ సెల్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. సునీల్ రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ దళితుల, గిరిజనుల హక్కులకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. గిరిజనుల, దళితుల హక్కులను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. ఎలాంటి సమస్యా ఉన్న విజిలెన్స్ కమిటీ దృష్టికి తీసుకురావాలని కమిటీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. దళితులకు సంబంధించి ఏ ఫిర్యాదు వచ్చినా నిమిషాల వ్యవధిలో పరిష్కారం చూపాలని జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. పలు గ్రామాల్లో దళితులకు చెందిన శ్మశానవాటికలు అన్యాక్రాంతం అయ్యాయని కమిటీ సభ్యులు చెప్పగా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగ అధికారులకు కలెక్టర్ సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల వివక్షత నుంచి.. పేదరికం నుంచి విముక్తి పొందాలంటే చదువు ఒక్కటే మార్గమని దీనిపై భావి తరాలకు ఉపదేశించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై నా ఉందన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలని అప్పుడే సమాజంలో ఆశించిన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, నాయకులు మృదు స్వభావులని కాబట్టే మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో   ఎస్సీ,ఎస్టీలపై జరిగే దాడులు తక్కువుగా నమోదవుతున్నాయన్నారు. ఒకరిపట్ల ఒకరు మానవీయ దృక్పథంతో నడుచుకుంటే సమాజంలో ఘర్షణలే జరగవని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు జిల్లా యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించినా.. దళితులపై దాడులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఘాటుగా అన్నారు. వేపాడ మండలం నల్లబిల్లి గ్రామంలో అసైన్డ్ అయిన వారికి 48 గంటల్లోగా పట్టాలు అందజేసే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో మానభంగానికి గురైన 51 మంది బాధితులకు శాశ్వత ఉపాధి చూపాలని సంబంధిత విభాగ అధికారులకు సూచించారు. అలాగే ఎస్సీ,ఎస్టీ కేసుల బాధితులకు నష్టపరిహారం త్వరితగతిన అందించాలని చెప్పారు. నూతనంగా నియమితులైన విజిలెన్స్ కమిటీ సభ్యులను ఉద్దేశిస్తూ.. మీరంతా సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని.. సమస్యను పెద్దది చేసేందుకు కాకుండా పరిష్కరించేందుకు కృషి చేయాలని.. నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని హితవు పలికారు. జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసేటప్పుడు తాజా కుల ధృవీకరణ పత్రాలు లేకపోయినా.. పాత పత్రాలు ఆధారంగా కేసు నమోదు చేయవచ్చని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి పరిష్కరిస్తామని బాధితులకు సత్వరమే న్యాయం జరిగే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దాడులను నివారించేందుకు 24గంటలు పాటు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని.. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందనలో భాదితులు ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. డి.ఆర్. వో. గణపతిరావు,  జెసి.జె.వెంకటరావు, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. సునీల్ రాజ్ కుమారు, డ్వామా పీడీ నాగేశ్వరరావు పలు అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి జగన్నాథం, డి.ఆర్.డి. ఎ. పీడీ సుబ్బారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయలక్ష్మి, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సెల్ డీఎస్పీ మోహనరావు, వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి, పశుసంవర్ధక శాఖ జేడీ ఏవీ నరసింహులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ స్వచ్చంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు. చివరిగా రైతు భరోసా కేంద్రాల నిర్వహణపై శిక్షణకు సంబంధించిన ప్రత్యేక బుక్ లెట్ ను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతులమీదుగా ఆవిష్కరించారు.