స్పోకెన్ ఇంగ్లీష్, యోగాలో ఉచిత శిక్షణ..
Ens Balu
4
Vizianagaram
2020-10-15 13:08:39
యువజన సర్వీసులశాఖ ఏర్పాటు చేసిన ఉచిత ఆన్‌లైన్ శిక్షణా తరగతులను వినియోగించుకొని, విద్యార్థులూ, యువత తమనుతాము తీర్చిదిద్దుకోవాలని సెట్విజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.నాగేశ్వర్రావు కోరారు. ఈ శిక్షణా తరగతులకు సంబంధించిన కరపత్రాలను తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సెట్విజ్ సిఇఓ నాగేశ్వర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న ఈ శిక్షణ విద్యార్థులకు గొప్ప సదవకాశమని పేర్కొన్నారు. కరోనా కాలంలో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న 15 నుంచి 35 ఏళ్ల మధ్యవయసున్నవారంతా ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడనుంచి యువజన సర్వీసులశాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో యోగ, ధ్యానంపై ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలు నుంచి 7.15 వరకూ జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో అన్నివయసులవారూ పాల్గొనవచ్చని సూచించారు. కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొనాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, దానికి యోగ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే యోగా వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.
వ్యక్తిత్వ వికాశంపై అక్టోబరు 17 నుంచి ప్రతీ శనివారం ఉదయం 10 గంటలు నుంచి 11.30 వరకు శిక్షణా కార్యక్రమం జరుగుతుందని, జూమ్ లింక్ద్వా, యూట్యూబ్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా ఈ శిక్షణ పొందవచ్చని సూచించారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాశ నిపుణులు గొంపా నాగేశ్వర్రావు, యండమూరి వీరేంధ్రనాధ్, పద్మ లాంటి వారిచే తరగతులు ఉంటాయన్నారు. ఇంగ్లీషు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రతీ శనివారం, బుధవారం సాయంత్రం 5 గంటలు నుంచి 6.30 వరకు జరుగుతున్నాయని, దీనిలో 15 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా, యూట్యూబ్ స్ట్రీమింగ్ ద్వారా పాల్గొనవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకోసం 7396219578 నెంబరుకు సంప్రదించాలని సిఇఓ సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస చౌదరి తదితరులు పాల్గొన్నారు.