ప్రభుత్వ భవనాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలి..


Ens Balu
4
కలెక్టరేట్
2020-10-15 14:07:15

విశాఖజిల్లాలో వచ్చే జనవరి 10వ తేదీ లోగా జిల్లా లోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలకు, ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలకు త్రాగునీటి సదుపాయం కల్పించాలని జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు కోరారు.  గురువారం  జల జీవన్ మిషన్ కార్యక్రమం పై  గ్రామీణ నీటి సరఫరా విభాగం  ఆధ్వర్యంలో  పంచాయితీరాజ్ , వ్యవసాయం, విద్య,  మహిళా శిశు సంక్షేమం,  సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం,  డిఆర్ డిఏ,  పశుసంవర్ధక శాఖ,  వైద్య ఆరోగ్య శాఖ, హౌసింగ్,  ఇ పి డి సి ఎల్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ లో  త్రాగునీరు, శానిటేషన్ విభాగం 2024 లోగా  జాతీయ జల జీవన్ మిషన్  కార్యక్రమం క్రింద  గ్రామీణ ప్రాంతంలో   కొళాయి కనెక్షన్ ద్వారా ఇంటింటికి  త్రాగు నీరు సరఫరాకు  సంకల్పించారని తెలిపారు. ప్రధానమంత్రి  గాంధీ జయంతి నాడు  "వందరోజుల కార్యక్రమం" క్రింద  వచ్చే జనవరి 10వ తేది లోగా గ్రామీణ ప్రాంతాలలోని  అన్ని  పాఠశాలలు , అంగన్ వాడీలు , ఇతర ప్రభుత్వ    సంస్థల భవనాలకు  కొళాయి కనెక్షన్ ల ద్వారా  త్రాగునీటి  సరఫరా లక్ష్యంగా  ప్రకటించారని అన్నారు.  ఇందులో భాగంగా  రక్షిత, పరిశుభ్రమైన  త్రాగునీటిని  సరఫరా చేసేందుకు  ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పనులను పూర్తి చేసిన తరువాత  గ్రామ పంచాయితీలు  నిర్వహణ   బాధ్యతలు చేపడతాయని తెలిపారు.  కమ్యూనిటీలు పథకం  విలువలో  10 శాతం   మొత్తాన్ని  నిర్వహణ వ్యయం క్రింద  సమకూర్చుకోవలసి ఉంటుందని  తెలిపారు.  50 శాతం కంటే ఎక్కువ  జనాభా  ఎస్ సి,  ఎస్ టి లు ఉన్న చోట  పథకం విలువలో  5 శాతం మొత్తాన్ని నిర్వహణ వ్యయం క్రింద సమకూర్చు కుంటే సరిపోతుందని  అన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు  నిర్ణీత  ప్రోఫార్మాలో  సత్వరమే వారి అవసరాలను గురించి వివరాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో   గ్రామీణ నీటి సరఫరా విభాగం  ఎస్ ఈ రవికుమార్,  జిల్లా పంచాయితీ అధికారి కృష్ణకుమారి,  ఐసిడి ఎస్  పిడి సీతామహాలక్ష్మి,  సాంఘీక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు రమణమూర్తి,  పశుసంవర్థక శాఖ  సంయుక్త సంచాలకులు రామకృష్ణ,  జిల్లా పరిషత్  డిప్యూటి  సి ఇ ఓ  నిర్మలాదేవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.