ప్రభుత్వ కార్యాలయాలకు మంచినీటి సౌకర్యం..
Ens Balu
2
కలెక్టరేట్
2020-10-15 15:41:25
కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలుచేస్తున్న జల జీవన్ మిషన్ కింద అన్ని ప్రభుత్వ సంస్ధలకు తాగునీటి సరఫరా కల్పించనున్నట్లు సంయుక్త కలక్టరు (అభివృద్ది) డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. అక్టోబరు 2 నుండి వంద రోజులలోపల ఈ పధకం కింద పైపు కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. గురువారం కలక్టరేట్ ఆడిటోరియంలో పలు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్ధాయి నుండి జిల్లాస్ధాయి వరకు తాగునీరు అవసరమున్న ప్రతి ప్రభుత్వ కార్యాలయం వారి అవసరతను నిర్ధేశిత ప్రొఫార్మాలో తెలియ జేయాలన్నారు. ముఖ్యంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నేస్ సెంటర్లు, అంగన్ వాడి కేంద్రాలతో పాటు, పాఠశాలలు, వసతి గృహాల వివరాలు కూడా సమర్పించాలని ఆదేశించారు. అద్దె భవనాలలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వాటి వివరాలను సమర్పించాలన్నారు. శనివారం సాయంత్రంలోగా ప్రతిశాఖ ఉన్నతాధికారి నుండి వారి పరిధిలో నున్న కార్యాలయాల సమాచారం అందజేయాలన్నారు. ప్రస్తుతం పైపుద్వారా తాగునీరు సదుపాయం ఉన్నది, పైపు లేకుండా ఉన్నవి, ఇతర మార్గాల ద్వారా నీటి సరఫరా ఉన్నవి, రక్షిత మంచినీటి పధకాలు ఉన్నవాటి వివరాలను నిర్ధేశిత ప్రొఫార్మాలో సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా ఎస్.ఇ. పి.రవి, ఐసిడియస్ పిడి యం .రాజేశ్వరి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి డి. కీర్తి, ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.