నెలాఖరుకి 65% పన్నులు వసూలు చేయాలి..
Ens Balu
3
జీవిఎంసీ కార్యాలయం
2020-10-15 18:57:18
జీవిఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో ఈ నెల చివరినాటికి 65శాతం పన్నులు వసూలు చేయాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆశాజ్యోతి అధికారులను ఆదేశించారు. బుధవారం జీవీఎంసీ లో జోనల్ కమిషనర్లు, రెవిన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2020 – 21 ఆర్ధిక సంవత్సరంలోని ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, వాణిజ్య సముదాయాలు, ట్రేడ్ లైసెన్సులు మొదలైన వాటి నుండి సెప్టెంబర్ చివరి నాటికి 65శాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ మధ్య నూతనంగా ఏర్పడిన వాణిజ్య సముదాయాలను, ఇళ్లను గుర్తించి వాటికి పన్నులు వేయాలని ఆదేశించారు. చాలా కాలంగా తక్కువ పన్నుగల గృహ సముదాయాలు, వాణిజ్య సముదాయాలు గుర్తించి వెంటనే పన్ను రివైజ్ చేయాలని ఆదేశించారు. వార్డు పరిపాలన(అడ్మిన్) కార్యదర్శులను భాగస్వాములను చేసి పన్నులు వసూల్లును వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రజా అభ్యర్ధనలను కాలాతీతం కాకుండా, ముందుగానే పరిష్కరించాలన్నారు. ఏవైనా దరఖాస్తులు ఎస్.ఎల్.ఏ. దాటి వెళ్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని జోనల్ కమిషనర్లుతో పాటు రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.