పంట నష్టం పారదర్శకంగా నమోదు చేయాలి..


Ens Balu
3
కలెక్టరేట్
2020-10-15 18:59:25

వరదలలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు  నష్టపరిహారం అందిస్తామని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం  కలక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో వర్షాలు, వరదలు, ఆస్థి, పంటనష్టాలపై జిల్లా కలక్టరు మరియు  వివిధశాఖల అధికారులతో  ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.  అనంతరం  విలేఖరులతో మాట్లాడుతూ అధికారయంత్రాంగల ముందస్తు అప్రమత్తతతో  ఆస్థి, ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు.  వరదలలో చనిపోయిన వారికి 48 గంటలలో పరిహారం అందిస్తున్నామని, ములగాడ లో చనిపోయిన ఇద్దరికి 4 లక్షల వంతున పరిహారం అందించడం జరిగిందని, మిగిలిన వారికి కూడా  పరిహారం అందించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  అనకాపల్లి నియోజకవర్గంలో  శారదానది,యలమంచిలి నియోజకవర్గంలో వరహానది , పాయకరావుపేట నియోజకవర్గంలో తాండవ నది పొంగుట వలన పంటనష్టం జరిగిందన్నారు. జిల్లాలో 30 మండలాలకు చెందిన 285 గ్రామాలలో 13135 మంది రైతులకు చెందిన  5075 హెక్టార్లలో వరి, 666 హెక్టార్లలో  చెరకు, 54 హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు.  ఉద్యానవనశాఖకు సంబంధించి 84 హెక్టార్లలో  పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.  9 ఇళ్లు పూర్తి గాను, 96 ఇళ్లు  పాక్షికంగాను దెబ్బతిన్నాయని,  157.76 కిలోమీటర్లరోడ్లు దెబ్బతిన్నాయన్నారు.  ఎలక్ట్రికల్ డిపార్టుమెంటుకు సంబంధించి 372 ఫోల్స్ దెబ్బతిన్నాయని వాటిని వెంటనే బాగుచేయడం జరిగిందని తెలిపారు. జి.వి. యం .సి.,యలమంచిలి మున్సిపాలిటీ,  మత్సశాఖ కు సంబంధించి నష్టాలపై ప్రాధమిక నివేదికలు అందాయని  జిల్లా వ్యాప్తంగా అన్నిశాఖలకు సంబంధించి రూ. 8545.53 లక్షలు నష్టం జరిగినట్లుగా ప్రాధమిక అంచనా వేసినట్లు ఆయన తెలిపారు.  పంటనష్టం వివరాలను గ్రామ సచివాలయాలలో  ప్రదర్శిస్తారని, ఎవరైనా రైతులు వారి పంటనష్టం వివరాలు నమోదు కాకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని తెలిపారు.  పంటనష్టం వివరాలు నమోదు, పరిహారం పంపిణీ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.  జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ  జిల్లాలో ప్రస్తుత కాలంలో పడవలసిన వర్షపాతం కంటే 500 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయిందని తెలిపారు.  ఈ నెల 12,13,14 తేదీలలో భీమిలి, ఎస్. రాయవరం,యలమంచిలి, సబ్బవరం, విశాఖ అర్బన్, గాజువాక,రాంబిల్లిలలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయిందని అన్నారు. వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, పంచాయతీరాజ్,రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, మత్సశాఖ అధికారులు జిల్లా లో సంభవించిన నష్టాలను అంచనా వేసి ప్రాదమిక నివేదికలు సమర్పించారని, రాగల రెండురోజులలో పూర్తి వివరాలు సేకరించి నష్ట పరిహారం చెల్లింపు నిమిత్తం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.