ధాన్యం కొనుగోళ్లు సత్వరమే చేపట్టాలి..


Ens Balu
4
కలెక్టరేట్
2020-10-15 19:06:20

విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు తగిన ఏర్పాట్లు సత్వరమే చేపట్టాలని సంయుక్త కలెక్టర్ జీ సీ కిషోర్ కుమార్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షించేందుకు పౌరసఫరాల, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ తదితర శాఖల జిల్లాస్థాయి అధికారులతో ఆయన ఛాంబర్లో గురువారం సమావేశం నిర్వహించారు. కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయా విభాగాల అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో తలెత్తిన పొరపాట్లు ఈ ఏడాది తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని.. తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఈ ఏడాది కొనుగోలు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికా లేకుండా వచ్చిన అధికారులపై జేసీ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. గడువు సమీపించినా ధీమాగా ఉండటం సరికాదని.. కావాల్సిన సామగ్రి ఇంకా కొనుగోలు చేసుకోక పోవటం ఏంటని ప్రశ్నించారు. మరొక్క వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలవుతుందని దానికి తగిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతీ రైతు భరోసా కేంద్రం వద్దా విధిగా "ధాన్యం కొనుగోలు సహాయ కేంద్రం" పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రబీ సీజన్లో వివిధ విభాగాల వద్ద ఉండిపోయిన గోనె సంచులను వెంటనే తిరిగి తీసుకోవాలని ఆదేశించారు. పౌరసరఫరాలు, వెలుగు, పీఏసీఎస్, వ్యవసాయ శాఖలు సమన్వయంతో ప్రణాళికా యుతంగా వ్యవహరించి ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ. పీడీ సుబ్బారావు, వ్యవసాయ శాఖ జేడీ ఎం. ఆశాదేవి, జిల్లా పౌరసరఫరాల అధికారి పాపారావు తదితరులు పాల్గొన్నారు.