భూసేకరణ సత్వరం పూర్తిచేయాలి..
Ens Balu
3
కలెక్టరేట్
2020-10-15 19:12:50
విజయనగరం జిల్లాలో నిర్ణీతవధిలో ప్రాజెక్టులకు భూసేకరణను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతు భరోసా) డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ ఆదేశించారు. భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్లు, ప్రాజెక్టుల ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులతో భూసేకరణపై కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తోటపల్లి, తారకరామతీర్ధసాగర్, వట్టిగెడ్డ, అడారు గెడ్డ, గడిగెడ్డ తదితర ప్రాజెక్టులు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ భూసేకరణ పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన కాలపరిమితిలోగా భూసేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సంబంధిత ప్రాజెక్టులను కూడా పూర్తి చేసేవిధంగా పనులను నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తిచేయడంపై దృష్టి పెట్టిందని, దానికి అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అందువల్లే ప్రతీవారం భూసేకరణపై సమీక్షించడం జరుగుతోందని, వారం వారం భూసేకరణలో ప్రగతి ఉండాలని జెసి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, కెఆర్ఆర్‌సి ప్రత్యేక ఉప కలెక్టర్ కె.బాలాత్రిపుర సుందరి, భూసేకరణ ఉపకలెక్టర్లు ఎస్.వెంకటేశ్వర్లు, హెచ్‌వి జయరామ్, సాల్మన్ రాజు, ఇంజనీరింగ్ అధికారులు, తాశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.