నూతన సాగు పద్దతులు అవలంభించాలి..


Ens Balu
2
Anantapur
2020-10-15 19:36:15

నూతన సాగు పద్ధతులను అవలంభించి మహిళా రైతులు వ్యవసాయంలో మరింత మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుంట గ్రామం వద్దనున్న మనభూమి ఉమ్మడి వ్యవసాయ క్షేత్రం లో మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలంతా ఒక గ్రూపుగా ఏర్పడి వ్యవసాయంలో వివిధ పంటలను సాగు చేయడం చాలా గొప్ప విషయమని, మహిళలంతా సంఘటితంగా వ్యవసాయం చేయడం వల్ల వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. దీని ద్వారా జీవనాధారం పొందేందుకు అవకాశం ఉంటుందని, మనభూమి ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో ఇలాగే చిరు ధాన్యాలు, ఆకు కూరలు, వివిధ పంటల సాగు చేస్తూ విరివిగా ఆదాయం పొందుతూ మరింత అభివృద్ధి చెందాలన్నారు. మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా మహిళా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మహిళా రైతులను జిల్లా కలెక్టర్ సన్మానించారు.  అంతకు ముందు జిల్లా కలెక్టర్ మనభూమి ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో సాగుచేస్తున్న సొరకాయ, బీరకాయ, బెండ, వేరుశనగ తదితర పంటలను పరిశీలించి, ఆయా పంటల సాగు విధానంలో పాటిస్తున్న పద్ధతులను మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఎంత మంది పనిచేస్తున్నారు, ఇక్కడ సాగు చేస్తున్న పంటల వల్ల ఎంత ఆదాయం వస్తుంది అనే వివరాలను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రెడ్స్ సంస్థ అధ్యక్షురాలు భానుజ, వ్యవసాయ శాఖ ఏ డిఏ విద్యావతి, ఏడీ ఏ వెంకటరాముడు, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర ప్రసాద్, సైంటిస్టులు రాధాకుమారి, రాధిక, ఏ ఈ ఓ ప్రసాద్, మహిళా రైతులు, రెడ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.