కిసాన్ రైలు కి విరాళాలు అందించండి..
Ens Balu
1
అనంతపురం
2020-10-16 12:01:07
కిసాన్ రైల్ ట్రస్టుకు విరివిగా విరాళాలు అందించాలని జిల్లాలోని రైతు సానుభూతిపరులు, దాతలకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని ఉద్యాన ఉత్పత్తులను కిసాన్ రైల్ ద్వారా అనంత నుండి ఢిల్లీలోని ఆజాద్ పూర్ మార్కెట్ కు తరలిస్తున్న విషయం విధితమే. ఇందుకు సంబంధించి రవాణా ఛార్జీలను ముందస్తుగా రైల్వే కు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులు తమ ఉద్యాన ఉత్పత్తులను కిసాన్ రైలు ద్వారా ఢిల్లీకి పంపేందుకు ముందస్తుగా రవాణా ఛార్జీలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. అనంతపురం నుంచి న్యూఢిల్లీ కి తరలించే ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఒక టన్నుకు రవాణా ఛార్జీల ద్వారా 5136/- రూపాయలను రైల్వే వారు వసూలు చేస్తున్నారని, అందులో రవాణా ఛార్జీలలో 50 శాతం ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ చెల్లిస్తోందన్నారు. మిగిలిన సగం రూ.2568/-ల మొత్తాన్ని రైతులు చెల్లించాల్సి ఉందన్నారు. 50 శాతం రవాణా ఛార్జీలను కూడా చెల్లించలేని సన్న, చిన్నకారు రైతులను ఆదుకునేందుకు గాను కిసాన్ రైల్ ట్రస్టును ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టర్ మరియు హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ పేరిట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనంతపురం ఏబీకే రోడ్డు బ్రాంచ్ నందు జాయింట్ అకౌంట్ ను గురువారం ప్రారంభించామని పై ప్రకటన లో తెలిపారు. రైలు ట్రస్టు ద్వారా చిన్న, సన్న కారు రైతులను ఆదుకునేందుకు ఆసక్తిగల దాతలు, రైతుల పట్ల సానుభూతి చూపే దాతలు ముందుకు వచ్చి విరివిగా తమ విరాళాలను కిసాన్ రైల్ ట్రస్టు ఖాతా నెంబర్:91229820396 ( IFSC :APGB 0001070, Branch code:1070) కు జమ చేయాలన్నారు. కిసాన్ రైల్ ట్రస్టుకు దాతలు అందించిన విరాళాల మొత్తం నుండి సన్న, చిన్నకారు రైతుల తరపున రవాణా ఛార్జీలను ముందుగా రైల్వే వారికి చెల్లించి, మార్కెట్లో రైతుల ఉత్పత్తులు అమ్ముడైన తర్వాత రైతుల తరఫున చెల్లించిన మొత్తాలను తిరిగి కిసాన్ రైతు ట్రస్టుకు జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.