రైతులకు తప్పక న్యాయం చేస్తాం..
Ens Balu
4
Bukkarayasamudram
2020-10-16 15:51:23
శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం బుక్కరాయసముద్రం మండలం సిద్దారాంపురం గ్రామం వద్ద శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పొలాలను పరిశీలించి రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తమ పొలాలను అప్పగించామని, మాకు మరోచోట యూనివర్సిటీకి సంబంధించి 76.55 ఎకరాల పొలాలను ఇచ్చారని, ఆ భూములకు పాసుపుస్తకాలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమస్య పరిష్కరించేందుకోసం ఇక్కడికి వచ్చామన్నారు. పొలాలను సాగు చేసుకుంటున్న రైతులందరికీ అన్యాయం జరగకుండా చూస్తామని, నెల రోజుల్లో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గుణభూషణ్ రెడ్డి, తహసీల్దార్ మహబూబ్ బాషా, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సైంటిస్ట్ అండ్ హెడ్ శ్రీనివాస నాయక్, రైతులు పాల్గొన్నారు.