కిసాన్ రైల్ ట్రస్ట్ కి రూ.90 వేలు విరాళం..


Ens Balu
3
కలెక్టరేట్
2020-10-16 20:02:28

కిసాన్ రైల్ ట్రస్టుకు రూ.30,000/-చొప్పున రూ.90,000/- విలువ గల మూడు చెక్కులను  విరాళాల రూపంలో అనంతపురం, హిందూపురం ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ మరియు అనంత ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి లు అందచేశారు.. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో కిసాన్ రైల్ ట్రస్టుకు అనంతపురం, హిందూపురం ఎంపీలు మరియు అనంతపురం ఎమ్మెల్యే విరాళాలను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు కిసాన్ రైల్ ట్రస్టుకు విరాళాలు అందించిన ఎంపీలు, ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. వీరి బాటలో ఇతర ప్రజాప్రతినిధులు, దాతలు  ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందివ్వాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ఉద్యాన ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర  అందించాలనే ఉద్దేశ్యం తో పాటు అనంత రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్రం నుంచి కిసాన్ రైల్ ప్రవేశ పెడితే బాగుంటుందని భావించి భారత ప్రధానికి, సంబందిత కేంద్రమంత్రులకు లేఖలు రాయడం జరిగిందన్నారు. వాటి ఫలితంగా మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో అనంతపురం నుంచి ఢిల్లీలోని ఆజాద్ పూర్ మార్కెట్ కు అనంత ఉద్యాన ఉత్పత్తులను తరలించేందుకు రెండవ కిసాన్ రైల్ ను   సెప్టెంబర్ 9వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు వీడియో లింక్ ద్వారా ప్రారంభించారన్నారు. కిసాన్ రైల్ ద్వారా ఉద్యాన ఉత్పత్తుల రవాణా ఛార్జీలను  సగానికి తగ్గించి రైతులను ఆదుకోవాలని, రైతుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర వ్యవసాయ, రైల్వే శాఖల మంత్రులను కోరడం జరిగిందన్నారు..ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ రైలు ద్వారా ఢిల్లీ మార్కెట్ కు తరలించే ఉద్యాన ఉత్పత్తుల రవాణా ఛార్జీలలో 50 శాతం ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ద్వారా చెల్లించేందుకు అంగీకరించిందన్నారు. రైతుల వాటాగా చెల్లించాల్సిన 50 శాతం రవాణా ఛార్జీలను కూడా చెల్లించలేని సన్న, చిన్నకారు రైతులను ఆదుకునేందుకు గాను కిసాన్ రైల్ ట్రస్టును ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టర్ మరియు హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ పేరిట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనంతపురం ఏబీకే రోడ్డు బ్రాంచ్ నందు జాయింట్ అకౌంట్ ను గురువారం నాడు ప్రారంభించామన్నారు.  కిసాన్ రైల్ ట్రస్టు ద్వారా చిన్న, సన్న కారు రైతులను ఆదుకునేందుకు ఆసక్తిగల దాతలు ముందుకు వచ్చి విరివిగా తమ విరాళాలను కిసాన్ రైల్ ట్రస్టు ఖాతా నెంబర్:91129820396 ( IFSC :APGB 0001070, Branch code:1070) కు జమ చేయాలన్నారు.  ఈ సందర్భంగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ, అనంతపురం నుంచి న్యూఢిల్లీ కి తరలించే ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఒక టన్నుకు రవాణా ఛార్జీల ద్వారా 5136/- రూపాయలను రైల్వే వారు వసూలు చేస్తున్నారని, అందులో రవాణా ఛార్జీలలో 50 శాతం ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ చెల్లిస్తోందన్నారు. మిగిలిన సగం రూ.2568/-ల మొత్తాన్ని  రైతులు చెల్లించాల్సి ఉందన్నారు. ముందస్తుగా సగం రవాణా ఛార్జీలను కూడా చెల్లించలేని ఉద్యాన రైతుల కోసం దాదాపు 50 మందితో 15 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయదలచామన్నారు. అందులో భాగంగా తాను, హిందూపురం ఎంపీ, అనంతపురం ఎమ్మెల్యే 30 వేల రూపాయల చొప్పున విరాళాలను జిల్లా కలెక్టర్ కు అందజేశామన్నారు.  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, జిల్లాలోని ఉద్యాన ఉత్పత్తులు పండించే రైతులు కిసాన్ రైలు ద్వారా తమ ఉత్పత్తులను ఢిల్లీ మార్కెట్ కి తరలించేందుకు చెల్లించే రవాణా ఛార్జీలలో 50 శాతం తగ్గించాలని ఇదివరకే కోరారన్నారు. ఈ అంశాన్ని జిల్లాలోని ప్రజాప్రతినిధులు ద్వారా కేంద్రానికి విన్నవించి రవాణా చార్జీలలో 50 శాతం తగ్గించేలా కృషి చేయడం జరిగిందన్నారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ, జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి అని, దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని రైతులు ఉద్యాన పంటలు పండిస్తున్నారన్నారు. అయితే రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక, సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేక నష్టపోవడం జరుగుతోందన్నారు. టమోటా సీజన్లో సరైన ధర లేక రోడ్లపై పారేసేవారన్నారు. రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం, అనంత, హిందూపురం ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కిసాన్ రైల్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి రవాణా చార్జీలు 50 శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు. జిల్లా ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ముందుగా రవాణా ఛార్జీలు చెల్లించలేని రైతులకు మేలు చేసేందుకు  కిసాన్ రైల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్, హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ పేరిట జాయింట్ అకౌంట్ ప్రారంభించి అందులో 15 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ ట్రస్ట్ నుండి రైతుల తరపున రవాణా ఛార్జీలు చెల్లించి, వారి పంట అమ్ముడు పోయాక తిరిగి వారి నుండి ఆ మొత్తాన్ని ట్రస్టుకు జమ చేయడం ద్వారా జిల్లా రైతాంగానికి మేలు చేసే చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ భాషా, అనంతపురం జిల్లా డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరీ కమిటీ మెంబర్ సి. అశ్వర్థ నాయక్, మాజీ జడ్పిటిసీ వెన్నెపూస రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.