ప్రజలకు పూర్తిస్థాయి సేవలందించాలి..
Ens Balu
4
Ramavaram
2020-10-16 20:31:08
గ‌్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవలు మరింత వేగవంతం చేయాల్సి ఉందని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రజలు అందించే దరఖాస్తుల పరిష్కారం నిర్ణీత గడువులోపే జరగాల్సి ఉందన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు వారు నివసించే గ్రామంలోనే సత్వర, మెరుగైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ ఉద్దేశ్యాన్ని నెరవేర్చే దిశగా సచివాలయ ఉద్యోగులు కృషిచేయాలన్నారు. గంట్యాడ మండలం రామవరంలోని గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ జె.వెంకటరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సచివాలయంలో సిబ్బంది హాజరును పరిశీలించి ఉద్యోగి వారీగా ఏవిధులు నిర్వహిస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని, ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకొనే విధానాన్ని సూచిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేసినదీ లేనిదీ పరిశీలించారు. ఇప్పటివరకు సచివాలయానికి వచ్చిన ఇ.రిక్వెస్టులు, వాటిలో పరిష్కారం చేసిన వివరాలను తెలుసుకున్నారు. గ్రామంలో సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. సచివాలయ నిర్వహణపై ఆరా తీశారు. విజయనగరం రూరల్ మండలం చెల్లూరు గ్రామ సచివాలయాన్ని కూడా జె.సి. వెంకటరావు శుక్రవారం తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు, సంక్షేమ పథకాలపై సమాచారం, ముఖ్యమైన ఫోన్ నెంబర్లు డిస్ ప్లే తదితర అంశాలను ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన సమాచారాన్ని పరిశీలించారు.