పీడిత ప్రజల గొంతుక సీపీఎం..
Ens Balu
3
Jagadamba Centre
2020-10-17 13:21:17
సీపీఎం పుట్టుక పీడిత ప్రజల కోసమని జిల్లా కార్యదర్శి కె.లోకనాధం అన్నారు. శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ శత వార్షికోత్పవాల సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పతాకావిష్కరణలు సదర్భంగా జగదాంబ సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద సిపిఎం సీనియర్ నాయకులు వై.రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాడి 100 ఏళ్ళు పూర్తి అయ్యిందని నాటి నుండి నేటి వరకు దేశ స్వాతంత్య్రం కోసం, ప్రజల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించిందని, కుల, మత, ప్రాంతీయ విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కార్మిక, కర్షక హక్కుల పరిరక్షణ కోసం నేటికీ క్రుషి చేస్తుందని, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఉందన్నారు. నాడు స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ వాళ్ళకు ఎదురొడ్డి నిలిచిందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర బిజెపికి లేదు. కాని నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశానికి పట్టుకొమ్మలైన ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుందని, రాష్ట్రాలకు ఉన్న హక్కులను పూర్తిగా కాలరాస్తుందన్నారు. రాజ్యాంగ హక్కులను పూర్తిగా తుంగలోకి తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. కుల, మత రాజకీయాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తుందన్నారు. నాడు, నేడు ఎన్నడూ ప్రజల తరపున నికరంగా పోరాడేది ఎర్రజెండా ఒక్కటేనన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు బి.జగన్, జిల్లా, నగర నాయకులు సభ్యులు జి.నాయనబాబు, వి.వి.శ్రీనివాసరావు, ఎం.సుబ్బారావు, జివిఎన్ చలపతి, అప్పలరాజు, సూర్యడు, విహెచ్.దాసు తదితరులు పాల్గొన్నారు.