వర్చువల్ అదాలత్ లతో సత్వర న్యాయం


Ens Balu
3
Vizianagaram
2020-10-17 13:48:40

వర్చ్యువల్ లోక్ అదాలత్  కార్యక్రమం ద్వారా సత్వర న్యాయాన్ని అందిస్తున్నట్టు విజయనగరం జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ అధ్యక్షులు జి.రామకృష్ణ తెలిపారు.  శనివారం, లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా కోర్టు ఆవరణలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించు నిమిత్తం  కరోనా నేపథ్యంలో న్యాయ సేవాధికార సంస్ధ వర్చ్యువల్ (వీడియో కాన్ఫరెన్సు) ద్వారా లోక్ అదాలత్ నిర్వహించ వలసినదిగా హైకోర్టు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కావున హైకోర్టు ఆదేశాలను అనుసరించి,   జిల్లా లోని అన్ని కోర్టులలోను వీడియో కాన్ఫరెన్సు ద్వారా  లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.  ఇరు పార్టీల కక్షిదారులు ఇంటి నుండే తమ కేసులను పరిష్కరించుకునేందుకు ఈ  అవకాశాన్ని  కలిగించడం జరిగిందని తెలిపారు.   మారుమూల ప్రాంతాలలో న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తద్వారా సమయం, ధన నష్టం నివారణకు అవకాశం వుందన్నారు.  త్వరితగతిన నిర్ణీత సమయంలో న్యాయాన్ని అందించడం జరుగుతుందన్నారు.  లోక్ అదాలత్ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయన్నారు.  మీడియేషన్ మరియు కౌన్సిలింగ్ ద్వారా ఇరు  పార్టీలు,  అంగీకారం మరియు ఆమోదం మేరకు శాంతియుతంగా పరిష్కారం లభిస్తుందన్నారు. రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్స్ యాక్టు కేసులు, మోటారు యాక్సిడెంటు   క్లెయిమ్  కేసులు, ఫ్యామిలీ కోర్టు కేసులు, లేబర్ కేసులు, ప్రభుత్వ భూసేకరణ కేసులు, బ్యాంక్ కేసులు, సివిల్ కేసులు, రెవిన్యూ కేసులు, ఇతర రెవిన్యూ కేసులు, సర్వీస్ మేటర్సు, పాత పెండింగ్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు, రాజీ మార్గం ద్వారా పరిష్కరించు కోవచ్చునని తెలిపారు. జిల్లా కోర్టు మరియు జిల్లాలోని  ఇతర కోర్టులలోని న్యాయ సేవాధికార సంస్ధ వారు వర్చువల్ ద్వారా  కేసులను రాజీచేయడం ద్వారా పరిష్కరించడం జరుగుతున్నదని  తెలిపారు.          కేసుల పరిష్కారానికి మూడు బెంచీల ను ఏర్పాటు  చేసామని,  పి.అన్నపూర్ణ, ఫ్యామిలీ కోర్టు కం-III అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి  మరియు జి.రాధా రాణి అడ్వోకేట్   మెంబరు లతో మొదటి బెంచ్ ఏర్పాటు చేసామని  తెలిపారు.   కె. నాగమణి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మరియు  జి.వనజాక్షి, అడ్వోకేట్ మెంబర్ లతో రెండవ బెంచ్ ఏర్పాటు చేసామని, కె.జయలక్ష్మి, సీనియర్ సివిల్ జడ్జి-కం-సెక్రటరీ  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, అడ్వోకేట్ మెంబరు పి.రమేష్ కుమార్ లతో 3వ బెంచ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  అవసరం మేరకు మరిన్ని బెంచ్ లు ఏర్పాటు చేసి త్వరితగతిన కేసులను పరిష్కరిస్తామని  జిల్లా జడ్జి తెలిపారు.