హెచ్ఎల్సీ కాలువ నీటి సరఫరా పై ఆరా..
Ens Balu
3
కనేకల్
2020-10-17 19:05:06
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కెనాల్ బాట పట్టారు. హెచ్ఎల్సీ కాలువలో నీటి ప్రవాహం ఎంతమేరకు వస్తోంది, కాలువ గట్ల స్థితిని తెలుసుకునేందుకు హెచ్ఎల్సీ కాలువ మీదుగా పర్యటించారు. శనివారం కనేకల్ మండల కేంద్రం వద్దనున్న చిక్కణ్ణేశ్వర వడియార్ చెరువును, హెచ్ఎల్సీ కాలువను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిక్కణ్ణేశ్వర వడియార్ చెరువులో నీటి నిల్వ ఎంత ఉంది, హెచ్ఎల్సీ కాలువలో నీటి ప్రవాహం ఎంత ఉంది, రావాల్సిన వాటా ప్రకారం నీటి వాటా వస్తోందా లేదా అనే వివరాలను హెచ్ఎల్సీ ఎస్ ఈ రాజశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హెచ్ఎల్సీ కాలువపై ఉన్న బ్రిడ్జ్ ను పరిశీలించారు. అనంతరం హెచ్ఎల్సీ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడారు. హెచ్ఎల్సీ కాలువలో నీటి ప్రవాహం పూర్తి స్థాయిలో వెళుతుందా లేదా అని తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇంతకు కొన్ని రోజుల ముందు ఐఏబి సమావేశం జరిగిందని, అందులో నిర్ణయించిన మేరకు హెచ్ఎల్సీ కాలువలో నీటి వాటా వస్తోందా లేదా, నీటి వాటా మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు తాగు, సాగు నీటి సరఫరా చేసేందుకు, కాలువ కింద ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతున్నాయి తదితర అంశాల పరిశీలనకు కాలువ బాట కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన్, తహసీల్దార్ ఉషారాణి, హెచ్ఎల్సీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.