కల్యాణకట్టను పరిశీలించిన టిటిడి ఈవో..
Ens Balu
2
Tirumala
2020-10-19 20:48:14
తిరుమలలో శ్రీవారి భక్తులు సులువుగా, సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు చేసినట్టు టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా సోమవారం అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి తిరుమలలోని కల్యాణకట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా కల్యాణకట్ట వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ ప్రతి రోజు టిటిడిలోని అన్ని విభాగాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం కల్యాణకట్టలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు పరిశీలించినట్లు తెలియజేశారు. కోవిడ్ - 19 దృష్ట్యా కల్యాణకట్టలో భక్తుల ఆరోగ్య భద్రతకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు. టిటిడి కల్పిస్తున్న వసతులపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించారు. అంతకుముందు ఈవో కల్యాణకట్టలోని తలనీలాలు సమర్పించే హాల్‌లు, టోకెన్లు ఇచ్చే కౌంటర్లు, పారిశుద్ధ్య ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటి ఈవో సెల్వం, ఎస్ ఇ - 2 నాగేశ్వరరావు, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, విజివోలు మనోహర్, ప్రభాకర్, ఏఈవో రమాకాంత్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.