31 నాటికి నష్టం నివేదికలు సమర్పించాలి..
Ens Balu
3
కలెక్టరేట్
2020-10-20 15:17:01
అక్టోబరు 31వ తేదీ నాటికి వరదల్లో సంభవించిన నష్టాల వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. మానవత్వంతో ప్రతి అంశాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన ఆదేశించారు. నష్టపోయిన వారి జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని అన్నారు. తద్వారా జాబితాలో తప్పిన వారిని చేర్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నవంబరు 15 నాటికి నష్టపరిహారం అందించుటకు చర్యలు చేపడతామని అన్నారు. నష్టపరిహారం అందించడం వలన రైతులకు రబీ పంటలకు ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. కోవిడ్ రికవరీ రేట్ లో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్నామని చెప్పారు. కోవిడ్ తగ్గుముఖం పడుతుందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కోవిడ్ వచ్చి వెళ్లిన తర్వాత గుండె, శ్వాస తదితర సమస్యలు తలెత్తుతున్నట్లు సర్వేలు చెపుతున్నాయని, దీనిని గమనించి తగిన విశ్రాంతి అవసరమని తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కోవిడ్ సమస్యలు ఉన్నవారు 104 నంబరుకు ఫోన్ చేయవచ్చని అన్నారు. ప్రతి ఆరోగ్య శ్రీ ఆసుపత్రిలో 15 రోజుల్లో హెల్ప్ డెస్క్ విధిగా ఉండాలని ఆయన స్పష్టం చేసారు. అచ్చట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, జేసీ పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. ఆరోగ్య మిత్ర లంచం అడిగితే ఉన్నత అధికారులకు తెలియజేయుటకు ఫోన్ నంబరు ఏర్పాటు చేయాలని అన్నారు. నవంబరు 2 నుండి బడులు తెరుస్తున్నామని, కోవిడ్ కు సంభందించిన అవగాహన పిల్లలకు కల్పించాలని ఆయన చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ ఏర్పాట్లు, మధ్యాహ్నం వరకు మాత్రమే బడులు ఉంటాయని చెప్పారు. పాఠశాలల్లో పిల్లల సంఖ్య ఆధారంగా ప్రత్యామ్నాయ దినాల్లో వివిధ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ఎక్కడా నీరు నిలువ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ క్రింద మెటీరియల్ కాంపోనెంట్ పనులు వేగవంతం కావాలని ఆదేశించారు. సీసీ రోడ్లు, కాలువల పైన దృష్టి సారించాలని ఆదేశించారు. నాడు నేడు పనులు వేగవంతం కావాలని ఆయన ఆదేశించారు. నవంబరు 6న జగనన్న తోడు పథకం ప్రారంభోత్సవం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు వలన నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డీఆర్డీఏ పిడి బి.నగేష్, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, సిపిఓ ఎం.మోహన రావు, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్, డిఇఓ కె.చంద్రకళ, అదనపు డిఎంహెచ్ఓ డా.బి.జగన్నాథ రావు, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, జలవనరులు, ఇపిడిసిఎల్, పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజినీర్లు డోల తిరుమల రావు, ఎన్. రమేష్, ఎస్.రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.