మనమంతా పోలీసులకు సహకరిద్దాం..
Ens Balu
4
శ్రీకాకుళం
2020-10-20 21:16:30
శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల విధి నిర్వహణకు సహకరించి మంచి సేవలు అందించేందుకు కృషి చేద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధ వారం పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేసారు. 1959 సంవత్సరంలో ఇండియా – టిబెట్ దేశ సరిహద్దుల రక్షణలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల పట్ల చైనా దాడి చేయడంతో పలువురు పోలీసులు మృత్యువాత పడటం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అప్పటి నుండి జాతీయ పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. పౌరుల రక్షణలోను, విపత్తుల వంటి సమయంలోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీసులు వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ఇటువంటి అమర వీరులను స్మరించడం మన విద్యుక్త ధర్మమని ఆయన చెప్పారు. ప్రజలు స్వేచ్చగా ఉండటానికి, ప్రాణాలు, ఆస్తులతో అభద్రతా భావం లేకుండా జీవించుటకు పోలీసుల సేవలు ప్రధానమన్నారు. కోవిడ్ 19 సమయంలో ప్రజల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టారని, కొంత మంది పోలీసు ప్రాణాలను వదిలారని, మరికొందరు కరోనా నుండి కోలుకుని తిరిగి విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. వ్యక్తిగత భద్రత, కుటుంబ భద్రతను కూడా విస్మరించి ప్రజల ప్రాణాలకు, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చి విధులు నిర్వహించడం ముదావహమన్నారు. అమర వీరులను స్మరించుకోవడం ద్వారా వారికి గౌరవాన్ని ఇవ్వాలని కోరారు. రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మలకు శాంతి కలుగాలని కోరుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో మృత్యవాత పడిన వారి ఆత్మకు శాంతి కలుగాలని ప్రజలు, న్యాయవ్యవస్ధ తరపున శ్రద్ధాంజలి ఘటించారు. అమర వీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అమర వీరుల ఆశిస్సులతో కుటుంబాలు ధైర్యంగా, మనోస్ధైర్యంతో జీవించాలని ఆకాంక్షించారు. పోలీసులకు ప్రతి పౌరుడు సహాయ సహకారాలు అందించి, పోలీసుల విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకం కలిగించకుండా తోడ్పడాలని కోరారు.