మాస్కే మన కవచం..


Ens Balu
4
Srikakulam
2020-10-21 14:30:37

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కే కవచమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు బుధ వారం ఏడు రోడ్ల కూడలి నుండి భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి సీదిరి అప్పల రాజు ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై నినాదాలతో స్వామి వివేకానంద కూడలి వరకు వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్ధ, అధికారులు, సిబ్బంది, వ్యాపార వర్గాలు, ప్రజలు ర్యాలీలో పాల్గొని నినదించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పల రాజు మాట్లాడుతూ గత ఏడు నెలలుగా కరోనాతో పోరాడుతున్నామన్నారు. రాష్ట్రంలో రోజుకు 70 వేల పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే ముందంజలో ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను దేశం నలుమూలల నుండి అందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. మౌళికసదుపాయాలు భారీగా ఏర్పాటు చేసుకున్నామని మంత్రి చెప్పారు. వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్ధ, వాలంటీరు వ్యవస్ధ కోవిడ్ ను ఎదుర్కొనడంలో కీలంకగా పనిచేసాయని అన్నారు. లాక్ డౌన్ ల విధింపుతో ఇంకా ఎంత కాలం బాధలు పడాలని ప్రజలు భావించే పరిస్ధితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తగ్గుముఖం పడుతోందని పేర్కొంటూ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో పండగలు నిర్వహించుకునే సమయమని, ఎక్కువగా గుమిగూడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. తద్వారా కేసులు పెరుగుదలకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా రెండవ దశ వ్యాప్తి ప్రారంభం అయినట్లు సర్వేలు చెపుతున్నాయని, ఇటుంటి దశ రాష్ట్రంలో రాకుండా ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని కోరారు. ప్రజల్లో ఇంకా నిర్లక్ష్యం నిర్లిప్తత భావన ఉందని అన్నారు. ప్రజలు చైతన్యవంతం కావాలని, అవగాహన పెంపొందించుకుని వైరస్ భారీన పడకుండా ఉండాలని కోరారు. ప్రజల్లో అవగాహన కలిగించుటకు గ్రామ సచివాలయం పరిధి నుండి జిల్లా స్ధాయి వరకు ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు.           జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ కరోన వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కు కవచంలా పనిచేస్తుందన్నారు. అందుకే మాస్కే కవచం నినాదంతో ప్రజలను అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రజలు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని శుభ్రపరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంత అవగాహన రావాలని అన్నారు. కరోనా రహిత జిల్లా ఆవిర్భవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, నగర పాలక సంస్ధ కమీషనర్ పల్లి నల్లనయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు, సమగ్ర శిక్షా అభియాన్ ఏపిసి పి.వి.రమణ, వైద్య శాఖ అధికారులు కృష్ణ మోహన్, సి.హెచ్.మహాలక్ష్మి, నగర పాలక సంస్ధ ఆరోగ్య అధికారి ఎం.వెంకట రావు, ప్రత్యేక అధికారి ప్రసాద్, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు దువ్వాడ శ్రీనివాస్., డా.మంత్రి వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.