వైఎస్.ఆర్.బీమాతో కార్మిక కుటుంబాలకు భద్రత
Ens Balu
4
Srikakulam
2020-10-21 14:43:24
వై.ఎస్.ఆర్.బీమాతో కార్మిక కుటుంబాలకు భద్రత నిస్తుందని సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వై.ఎస్.ఆర్.బీమా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సి.ఎం. మాట్లాడుతూ, అసంఘటిత కార్మికుల కుటుంబాలలోని కుటుంబ యజమానికి ప్రమాదం జరిగిన సందర్భంలో కుటుంబానికి వై.ఎస్.ఆర్.బీమా భద్రతనిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు రూ.510 కోట్లను వై.ఎస్.ఆర్.బీమా క్రింద అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ బీమా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదన్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం ఇబ్బందులు పడకూడదనే వుద్దేశ్యంతో ప్రభుత్వమే బీమాను చెల్లిస్తున్నదని తెలిపారు. తెలుపు రేషన్ కార్డు వున్న కుటుంబాల వారు, ఈ పథకానికి అర్హులు అని తెలిపారు. 18 నుండి 70 సం.ల వయస్సు కలిగి కుటుంబాన్ని పోషించే వారందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయడం జరుగుతున్నదన్నారు. లబ్దిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదని, మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. 18 నుండి 50 సం.ల వయస్సు గల లబ్దిదారుడు సహజ మరణం పొందితే రూ. 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు బీమా పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. 18 నుండు 50 సం.ల వయస్సు గల లబ్దిదారుడు పూర్తి అంగ వైకల్యం పొందితే రూ.5 లక్షలు బీమా పరిహారం అందించడం జరుగుతుందన్నారు. 51 నుండి 70 సం.ల వయస్సుగల లబ్దిదారుడు ప్రమాద వశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా , నామినీకి రూ.3 లక్షలు చెల్లించడం జరుగుతుందన్నారు. 18 నుండి 70 సం.ల వయస్సు గల లబ్దిదారుడు ప్రమాదవశాత్తు పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.1.50 లక్షలు బీమా పరిహారాన్ని చెల్లించడం జరుగుతుందన్నారు. బీమా ప్రీమియంను బటన్ నొక్కగానే వారి బ్యాంకు ఖాతాలకు జమ కాబడతాయన్నారు. బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపిస్తారని తెలిపారు. అనంతరం ఇన్సూరెన్సు కార్డులు వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు అందచేయడం జరుగుతుందని తెలిపారు.
గ్రామ సెక్రటేరియట్ ద్వారా తక్షణ సహాయంగా పదివేల రూపాయలను తక్షణ అవసరాలకు అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భంలో ఇన్సూరెన్సు క్లెయిమ్ మంజూరు కావడంలో ఆలస్యం జరుగుందనే వుద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదనే వుద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అనంతరం బటన్ నొక్కి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. జిల్లాలో పశు సంవర్థక శాఖామాత్యులు సీదిరి అప్పల రాజు, జిల్లా కలెక్టర్ జె.నివాస్, శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, కిల్లి కృపారాణితో కలిసి వై.ఎస్.ఆర్.బీమా బుక్ లెట్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంయుక్త కలెకర్టర్ శ్రీరాములు నాయుడు, డిఆర్.డి.ఎ. పి.డి బి.నగేష్, మెప్మా పి.డి. కిరణ్ కుమార్, ఎల్.డి.ఎం. హరిప్రసాద్, కార్మిక శాఖ సహాయ కమీషనర్లు సి.హెచ్.పురుషోత్తం, రాధ, పద్మజ, సహాయకార్మిక అధికారి బి.కొండల రావు,, బీమా మిత్రలు, లబ్దిదారులు, తదితరులు హాజరైనారు.