ప్రజా రక్షణలో పోలీసు సేవలు అపారం..
Ens Balu
3
Srikakulam
2020-10-21 19:09:56
ప్రజల రక్షణలో పోలీసుల సేవలు అపారమని జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ అన్నారు. బుధవారం పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి కోర్టు పోలీసు సమన్వయ అధికారులు హరికృష్ణ, ఇద్దరు కోర్టు గార్డులు బి. రమణ, వి. రవిని జిల్లా కోర్టు ఆవరణలో సన్మానించారు. పౌరుల రక్షణలోను, విపత్తుల వంటి సమయంలోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీసులు వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ప్రజలు స్వేచ్చగా ఉండటానికి, ప్రాణాలు, ఆస్తులతో అభద్రతా భావం లేకుండా జీవించుటకు పోలీసుల సేవలు ప్రధానమన్నారు. కోవిడ్ 19 సమయంలో ప్రజల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టారని, కొంత మంది పోలీసు ప్రాణాలను వదిలారని, మరికొందరు కరోనా నుండి కోలుకుని తిరిగి విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. వ్యక్తిగత భద్రత, కుటుంబ భద్రతను కూడా విస్మరించి ప్రజల ప్రాణాలకు, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చి విధులు నిర్వహించడం ముదావహమన్నారు. అమర వీరులను స్మరించుకోవడం ద్వారా వారికి గౌరవాన్ని ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో మృత్యవాత పడిన వారి ఆత్మకు శాంతి కలుగాలని ప్రజలు, న్యాయవ్యవస్ధ తరపున శ్రద్ధాంజలి ఘటించారు. అమర వీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అమర వీరుల ఆశిస్సులతో కుటుంబాలు ధైర్యంగా, మనోస్ధైర్యంతో జీవించాలని ఆకాంక్షించారు. పోలీసులకు ప్రతి పౌరుడు సహాయ సహకారాలు అందించి, పోలీసుల విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకం కలిగించకుండా తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమములో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి, మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి తదితరు పాల్గొన్నారు .