ప్రముఖ ఆసుపత్రిగా ఎదగాలి..
Ens Balu
3
Srikakulam
2020-10-21 19:13:27
ఉత్తరాంధ్రలోనే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ఒక ప్రముఖ ఆసుపత్రిగా పేరుగాంచాలని, అదే నా కోరిక అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు అన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధిపై బుధ వారం రిమ్స్ లో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 7 నెలలుగా కోవిడ్ కోసమే మాట్లాడుతున్నామన్నారు. మౌలిక సదుపాయాలు ప్రస్తుతం కల్పించుకునే అవకాశం ఉందని తద్వారా ఆసుపత్రిలో అవసరాలను సమకూర్చుకోవచ్చని ఆయన చెప్పారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు రిమ్స్ ఆసుపత్రిలో బెడ్ కావాలని సిఫారసు చేయించుకునే స్ధాయికి వచ్చారని, అదే నమ్మకం సాధారణ సమయంలోనూ కొనసాగాలని సూచించారు. ఒక ప్రముఖ, లీడింగ్ ఆసుపత్రిగా వెలుగొందాలని ఆయన అన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన సేవలను జిల్లా కలెక్టర్ నివాస్ ఎప్పుడూ ప్రశంసిస్తూండేవారని అంతటి ఉత్తమ సేవలు అందించాలని కోరారు. ఆసుపత్రికి అవసరమగు కార్డియాలజి, యూరాలజి, నెఫ్రాలజి యూనిట్లు మంజూరుకు కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. ఆసుపత్రి వ్యవస్ధను పునవ్యవస్ధీకరించడం వలన యూనిట్లు మంజూరు సులభతరం కాగలదని చెప్పారు. తద్వారా వైద్య సీట్లు కూడా పెరుగుతుందని మంత్రి అన్నారు. జనరల్ మెడిసిన్ లో 4 యూనిట్లు ఉన్నాయని, కొత్తగా యూనిట్లు మంజూరుకు భవనం, స్థలం, బెడ్స్ లభ్యంగా ఉన్నాయని అన్నారు. పోస్టులు మాత్రమే అవసరమని, అందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. నెఫ్రాలజీ సేవలు ప్రారంభించాలని మంత్రి సూచించగా ఇప్పటికే నెఫ్రాలజీ సేవలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కార్డియాలజీ, యురాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు 6 గురు స్పెషలిస్టుల నియామకానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ స్వతహాగా వైద్యులుగా ఉన్న మంత్రి మంత్రి మంచి సలహాలు, సూచనలు ఇచ్చారని తద్వారా కోవిడ్ లో జిల్లాలో చేపట్టిన చర్యలు మంచి పేరు తీసుకువచ్చాయని తెలిపారు. గతసారి మంత్రి చేసిన సమీక్ష మంచి ఫలితాలు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణ వేణి మాట్లాడుతూ రాష్ట్ర వైద్య శాఖామంత్రి సందర్శించిన తరువాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 50 నుండి 100కు పెంచారని, స్టాఫ్ నర్సుల పోస్టులు 180 కి పెరిగాయన్నారు. వైద్య సీట్లు 188 ఉన్నాయని, 2 వందలకు పెరుగుటకు కొన్ని మౌలిక సదుపాయాలు అవసరం ఉందని చెప్పారు. సీనియర్ ఫెకల్టీ - ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అవసరం ఉందని అన్నారు. పెడియాట్రిక్స్, గైనకాలజీలో అదనంగా రెండు యూనిట్లు చొప్పున, జనరల్ మెడిసిన్ లో 3 యూనిట్లు అవసరమని పేర్కొన్నారు. తద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించగలమని చెప్పారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగాలు లేవని, ఇతర ఆసుపత్రులకు మంజూరు చేసారని ఆమె వివరించారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ విభాగాలలో సూపర్ స్పెషాలిటీ అవసరం ఉందని స్పష్టం చేసారు. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులకు వసతి సౌకర్యాల కొరత ఉందని, పోస్టు గ్రాడ్యుయేట్ లకు వసతి లేదని తెలిపారు. సి.టి స్కాన్ కు 16 స్లైడ్స్ అవసరమని, క్షేత్ర స్థాయి సందర్శనలకు 50 సీట్ల బస్సు అవసరమని వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, రిమ్స్ సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణ మూర్తి, వైద్యులు డా.ఆర్.అరవింద్, డా.సునీల్ నాయక్, చలమయ్య, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు