ప్రత్యేక సవరణలకు ప్రతిపాదనలు..
Ens Balu
2
కలెక్టరేట్
2020-10-21 20:20:45
భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2021 లో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ అనుమతులకు ప్రతిపాదనలు పంపినట్టు జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్ తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ గురించి తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కు సంబంధించి పాయకరావుపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు పోలింగ్ కేంద్రాలుగా వినియోగించిన భవనాల లో నిర్మాణ పనులు చేపట్టిన కారణంగా 2 పోలింగ్ కేంద్రాలు గా వేరే భవనాలను గుర్తించి, ప్రతిపాదనలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుమతి కోసం పంపామని తెలిపారు. అరకు వేలీ నియోజకవర్గంలోని 17 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయా పాఠశాలలు అప్ గ్రేడ్ అయిన కారణంగా వాటి పేర్లు మారినందున తదనుగుణంగా పోలింగ్ కేంద్రాల పేర్లు మార్చడానికి ప్రతిపాదనలు రూపొందించినట్టు ఆయన వివరించారు. ఎన్నికల సంఘం నియమాల ప్రకారం 1500 కంటే ఎక్కువ ఓటర్లు నమోదైన పోలింగ్ కేంద్రాలను విడదీసి, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం భీమిలి నియోజకవర్గంలో 12 కొత్త పోలింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేయడానికి, పెందుర్తి నియోజకవర్గంలో 5 కొత్త పోలింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున జి.ఎ.నారాయణ రావు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి గా కొప్పల రామ్ కుమార్, సిపిఎం నుంచి వి.వి. శ్రీ నివాసరావు, తెలుగు దేశం పార్టి తరపున ఎపియం సత్యనారాయణ పాల్గొన్నారు.