రైస్ కార్డుదారులందరికీ వైఎస్సార్ భీమా..


Ens Balu
3
కలెక్టరేట్
2020-10-21 20:54:20

రైస్ కార్డు పొందేందుకు అర్హత ఉన్న లబ్దిదారుల కుటుంబాలన్నీ  వై.యస్.ఆర్. బీమా పథకానికి అర్హులని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వై.యస్.ఆర్. బీమా పథకంను ఆయన ప్రారంభించారు. ఈ పథకం కుటుంబాన్ని పోషించే పెద్దకు అకస్మాత్తుగా ఏదైనా జరిగితే అతని మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఆపత్కాలంలో ఆర్థిక భరోసానిస్తుందని, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన బియ్యపు కార్డులు కలిగియున్న కోట్లాది కుటుంబ సభ్యుల భద్రతకు ధీమా ఇస్తుందన్నారు.  కుటుంబ జీవన భద్రతే పరమావధిగా వారిని సకాలంలో ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడమైనదని చెప్పారు. ఈ పథకం బియ్యం కార్డు పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలన్నీ అర్హులని, 18 సంవత్సరాలు నుండి 70 సంవత్సరాల వయస్సు కలిగి కుటుంబాన్నీ పోషించే వారు ఈ పథకానికి అర్హులని, గ్రామ/వార్డు సచివాలయ వాలంటీర్లు డోర్ టు డోర్ సర్వే ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్దిదారుల గుర్తింపు జరుగుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా 18-50 సంవత్సరాల వయస్సు గల లబ్దిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు బీమా పరిహారంను ప్రభుత్వం చెల్లిస్తుందని, 18-50 సంవ.ల వయస్సు గల లబ్దిదారుడు ప్రమాదవశాత్తు పూర్తి అంగ వైకల్యం పొందితే రూ.5 లక్షలు బీమా పరిహారం అందుతుందని, 51-70 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారుడు ప్రమాద వశాత్తు మరణిస్తే నామినీకి రూ.3 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందితే లబ్దిదారుడికి రూ.3 లక్షలు పరిహారం అందుతుందన్నారు.  18-70 సం.ల వయస్సు గల లబ్ధిదారుడు ప్రమాద వశాత్తు పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.1.50 లక్షలు బీమా పరిహారం అందుతుందని పేర్కొన్నారు.  వ్యక్తి మరణించిన వెంటనే తక్షణ అవసరాలకు పది వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.  వ్యక్తి మరణించిన వెంటనే బీమా కార్డును సచివాలయంలో చూపిస్తే పది వేల రూపాయలు అందజేస్తారన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 11,36,535 మంది అర్హత గల రైస్ కార్డు లబ్దిదారులుండగా ఇంత వరకు 9,65,223 మంది వై.యస్.ఆర్. పథకం కింద నమోదు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ తో పాటు, జివియంసి కమీషనర్ జి. సృజన, శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్ రాజ్, జిల్లా జాయింట్ కలెక్టర్-3 గోవిందరావు, డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్టు డైరక్టర్ విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.