కో- ఆప్టెక్స్ లో రాయితీ సంబరాలు..
Ens Balu
5
Srikakulam
2020-10-23 15:07:40
దసరా, దీపావళి పండుగల సందర్భంగా కో- ఆప్టెక్స్ లో రాయితీ సంబరాలు ప్రారంభమయ్యాయని, సిక్కోలు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని చేనేత కళాకారులను ఆదుకోవాలని జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేష్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్.టి.సి.కాంప్లెక్స్ దరి అంబేద్కర్ కూడలి వద్ద నున్న దుకాణ సముదాయంలో కో-ఆప్టెక్స్ రెండవ షోరూమ్ శుక్రవారం ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని వస్ర్త విక్రయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రతీ వస్త్ర కొనుగోలుపై 30% వరకు ప్రత్యేక రాయితీలను ఇస్తున్నట్లు తెలిపారు. నేత కళాకారులను ప్రోత్సహించే దిశగా ప్రతీ వస్త్రంపై చేనేత కళాకారుల ఫొటోలను ముద్రించి, నూతన వరవడికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు వాయిదాల పద్దతిలో వస్త్రాలను కొనుగోలు చేసేలా అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. అలాగే నెలకు రూ.300/-ల నుండి రూ.3,000/-ల వరకు 11 మాసాల పథకంలో చేరడం ద్వారా 53% వరకు లాభం పొందే అవకాశాన్ని కో-ఆప్టెక్స్ కల్పించిన సంగతిని ఆయన గుర్తుచేసారు. ఈ వస్త్రాలయంలో సిక్కోలు ప్రజలకు అవసరమైన కంచి,ఆరని, సేలం, కోయంబత్తూరు పట్టుచీరలతో పాటు ఆర్గానిక్ కాటన్ చీరలు, రెడిమేడ్ షర్టులు, లేటెస్ట్ దుప్పట్లు, బ్లాంకెట్స్, టవల్స్, లుంగీలు, పంచెలు మొదలగు సరికొత్త మోడల్స్ లలో లభ్యమయ్యేలా ఏర్పాట్లుచేయడం జరిగిందన్నారు. ఈ సదవకాశం దీపావళి పర్వదినం వరకు మాత్రమే లభ్యమవుతుందని, శ్రీకాకుళం ప్రజలు విరివిగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వస్త్రాలపై లభించే ప్రత్యేక రాయితీ ప్రతీ కో-ఆప్టెక్స్ షోరూమ్ నందు లభించే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో షో రూమ్ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.