చేతి వృత్తులను ప్రతీఒక్కరూ ఆదరించాలి..
Ens Balu
2
Visakhapatnam
2020-10-23 16:43:44
కరోనాలాంటి క్లిష్ట సమయంలో చేతి వృత్తుల కళాకారులను ఆదుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ కొనియాడారు. వైజాగపటం చాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ సిరిపురంలోని వాల్తేర్ క్లబ్‌లో ఏటికొప్పాక లక్కబొమ్మలతో పలు చేతి వృత్తి కళా ఖండాల ప్రదర్శనను ఎంపీ శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఇలాంటి మంచి కార్యక్రమం చేపడుతున్న వాల్తేరు క్లబ్ కృషి ప్రశంసనీయమన్నారు. మహిళా వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యడవల్లి హేమ మాట్లాడుతూ, కళాకారులు వారి సృజనాత్మకత, కృషికి గొప్ప గుర్తింపు పొందాలని వారికి చేయూత నిచ్చేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ పండుగ సీజన్లో ప్రియమైనవారికి బహుమతిగా ఇవ్వడానికి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, తద్వారా కళాకారులకు ఆర్ధిక తోడ్పాటు అందించినవారవుతారన్నారు. చేతివృత్తి కళాకారులకు ఈ రకంగా తోడ్పాటు అందించటంపై వాల్తేరు క్లబ్ ప్రెసిడెంట్ ఫణీంద్రబాబు సంతోషం వ్యక్తంచేసారు. ఆర్ట్స్ & క్రాప్ట్సులను ప్రోత్సహించటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో బ్రాండింగ్, మార్కెటింగ్, భాగస్వామి అందరికీ సమగ్రమైన, స్ధిరమైన ఆర్ధిక వృద్ధిని, ఉపాధిని ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విశాఖపట్నం జిల్లా ఆఫీసర్ టి.చాముండేశ్వర రావు సహకారంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగలిగామని నిర్వాహకులు తెలిపారు. మహిళా వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ హేమ యడవల్లి, వాల్తేర్ క్లబ్ ప్రెసిడెంట్ పణీంద్ర బాబు, విసిసిఐ అధ్యక్షుడు వీరమోహన్, గౌరవ కార్యదర్శి సంధ్య గోడే, వైస్ ప్రెసిడెంట్ జీజా వల్సరాజ్, ఇతర కమిటీ సభ్యుల తదితరులు పాల్గొన్నారు.