యువతను చైతన్యపరచాలి..
Ens Balu
2
Srikakulam
2020-10-23 22:59:18
శ్రీకాకుళం జిల్లాలోని యువతను చైతన్యపరచి అన్ని రంగాల్లో ముందుండేలా చర్యలు చేపట్టాలని ఆసరా, సంక్షేమం సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు వెల్లడించారు. యువత కార్యక్రమాల నిర్వహణపై నెహ్రూ యువక కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా నీటి యాజమాన్య సంస్థ డి.ఎల్.ఆర్.సి సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు రిజిష్టర్ కాబడిన స్వచ్చంధ సంస్థలు, అసోసియేషన్లు చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. ప్రతీ స్వచ్చంధ సంస్థ మరియు అసోసియేషన్ ప్రతీ నెలా ఏదో ఒక శాఖతో సమన్వయం చేసుకుంటూ యువతను ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టేలా చూడాలని సూచించారు. అలాగే ప్రతీ కళాశాల, పాఠశాలలో యన్.సి.సిలు, యన్.ఎస్.ఎస్ లు ఉంటాయని వాటి సహకారంతో గ్రామస్థాయిలో యువతను చైతన్యపరచాలని అన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మరియు నెహ్రూ యువక కేంద్రం జిల్లా యూత్ కోఆర్టినేటర్ సమన్వయంతో నెలలో యువతకు సంబంధించిన రెండు కార్యక్రమాలను చేపట్టాలని, అందులో ఒకటి గ్రామీణ ప్రాంతం కాగా , రెండవది పట్టణ ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేయాలని, అదేవిధంగా ప్రతీ నెలా ఒక శాఖకు సంబంధించిన కార్యక్రమం ఉండేవిధంగా ప్రణాళికలు సిద్దం చేసుకొని ముందుకుసాగాలన్నారు. తద్వారా యువతలో మార్పు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలను యువత సద్వినియోగం చేసుకునేలా చూడాలని, తద్వారా వచ్చిన మార్పు మిగిలిన యువతకు ఆదర్శంగా నిలిచేలా ఉండాలని జె.సి పేర్కొన్నారు. ముందుగా ఇందులో భాగస్వాములైన శాఖాధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను నెహ్రూ యువక కేంద్రం చేపట్టి యువతలో మార్పును తీసుకువస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేసారు. యువత కోసం ఏర్పాటు చేసే కార్యక్రమాలకు సంబంధించిన నిధులను యన్.వై.కె సమకూర్చుకుంటుందని జె.సి స్పష్టం చేసారు. నెహ్రూ యువక కేంద్రం చేపట్టే కార్యక్రమాలతో యువతలో మార్పుతో పాటు నూతన ఉత్తేజం, అవగాహన వంటివి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాలో కొత్తగా నమోదుచేసుకునే స్వచ్చంధ సంస్థలకు రిజిస్ట్రేషన్ ఫీజులను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన బెజ్జిపురం యూత్ క్లబ్ సంచాలకులు యం.ప్రసాదరావును అభినందించిన ఆయన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సహకారంతో యువత అభివృద్ధి చెందే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో ముఖ్యప్రణాళిక అధికారి యం.మోహనరావు, నెహ్రూ యువక కేంద్రం జిల్లా యూత్ కో ఆర్డినేటర్ జి.మహేశ్వరరావు, సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాసరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్, జిల్లా పర్యాటక అధికారి యన్.నారాయణరావు, ఉప విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, ఐతమ్ కళాశాల డీన్ ఆచార్య డి.విష్ణుమూర్తి, ఏ.పి.స్కిల్ డెవలప్ మెంట్ నోడల్ అధికారి యన్.గోవిందరావు, యన్.సి.సి కో ఆర్డినేటర్ కెప్టన్ వంగ మహేశ్, యన్.ఎస్.ఎస్ నోడల్ అధికారి డా. కె.ఉదయకిరణ్, బెజ్జిపురం యూత్ క్లబ్ సంచాలకులు యం.ప్రసాదరావు, పి.వి.యస్.రామ్మోహన్ ఫౌండర్ పి.వి.యస్.రామ్మోహన్, డా.అప్పారావు, ఇతర అధికారులు , కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.