స్వీయ నియంత్రణే సరైన రక్షణ..


Ens Balu
2
Srikakulam
2020-10-23 23:05:52

శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనే భావనతో నిర్లక్ష్యధోరణి పనికిరాదని, ప్రతీ ఒక్కరూ కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణపై పారిశ్రామిక వేత్తలతో సమీక్షా సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, అయితే ఇది సంతోషించవలసిన సమయం కాదని స్పష్టం చేసారు. రానున్న కాలంలో స్వీయ నియంత్రణ పాటించకపోతే మునుపటికంటే కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కావున ప్రతీ ఒక్కరూ ఆరుబయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్కును ధరించాలని, విధిగా శానిటైజేషన్ చేసుకోవాలని సూచించారు. దీనివలన కొంతమేర కరోనాను నియంత్రించవచ్చని చెప్పారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతీ రోజూ ఒక్కో రంగంతో సమావేశాన్ని ఏర్పాటుచేసి కరోనా నియంత్రణకై తీసుకోవలసిన చర్యలు గురించి తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా నేడు పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో జనాభా ఉండే రంగం కార్మిక రంగం అని, కావున పరిశ్రమలలో పనిచేసే ప్రతీ ఒక్కరూ స్వీయ రక్షణ తీసుకోనట్లయితే కరోనా విజృంభించే అవకాశం ఉందని కలెక్టర్ స్పష్టం చేసారు. కరోనా నియంత్రణకై చర్యలు తీసుకోలేనట్లయితే పరిశ్రమలలో పనిచేసేవారితో పాటు వారి కుటుంబాలు కూడా కరోనా బారిన పడే అవకాశం ఉందని అన్నారు. కావున ప్రతీ ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని వారు తిరిగే ప్రతీ చోట తప్పనిసరిగా మాస్కును ధరిస్తూ, శానిటైజేషన్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. జిల్లాలో కరోనా నియంత్రణకై ప్రతీ ఒక్కరూ సహకరించారని, ఇందుకు అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా పారిశ్రామికవేత్తలు స్వచ్చంధంగా ముందుకువచ్చి కరోనా నియంత్రణకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో విరాళాలు అందజేసారని కొనియాడారు. పారిశ్రామిక వేత్తలు, స్వచ్చంధ సంస్థలు ఇచ్చిన సహకారంతో కరోనా రోగులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు. కరోనా సమయంలో అరబిందో పరిశ్రమ రోజుకు 5వేల మంది వరకు భోజన సదుపాయాన్ని కల్పించిందని, అలాగే  నాగార్జున ఆగ్రోటెక్ శానిటైజర్లను, షుగరి్ పారిశ్రామికవేత్తలు హైడ్రోక్లోరైడ్ వంటి వాటిని సమకూర్చడం జరిగిందని, వారి సహాయ సహకారాలు మరువలేనివని కొనియాడారు. ప్రతీ పరిశ్రమలో కరోనా నియంత్రణకు సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్సీలను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని, అలాగే కార్మికులు విధులు మారే సమయంలో తప్పనిసరిగా శానిటైజేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యాంటిన్లలో గుమిగూడకుండా ఉండేలా చూడాలన్నారు. పరిశ్రమల నుండి వెలువడే చెత్తను డీకంపోజ్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సాధ్యమైనంత మేర ఏ.సిల వాడకాన్ని తగ్గించాలని, ప్రతీ పరిశ్రమలో అత్యవసర మెడికల్ కిట్ ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.          సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. గతంలో జిల్లాలో 800 వరకు వచ్చే కరోనా కేసుల సంఖ్య నేడు 100కే పరిమితం మయిందన్నారు. దీనివలన కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందని భావించనవసరంలేదని, స్వీయరక్షణ పాటించకపోతే మరలా కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రజలు గుర్తించాలన్నారు. కళ్లు, ముక్కు, నోటి ద్వారానే కరోనా సోకే అవకాశమున్నందున ప్రతీ ఒక్కరూ వీటి నుండి రక్షణ పొందాలన్నారు. కొందరు మాస్కులను ధరిస్తూ, మాట్లాడే సమయంలో మాస్కులను తీసివేస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదని సూచించారు. ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే కార్మికులు వారి విధులకు వెళ్లేసమయంలో తప్పనిసరిగా మాస్కును ధరించాలని, ఎప్పటికపుడు శానిటైజేషన్ చేసుకుంటూ , పరిశ్రమలలో కూడా భౌతికధూరం పాటించాలని అన్నారు. విధుల నుండి ఇంటికి చేరే సమయంలో తమపై ఒక కుటుంబం ఆధారపడి ఉందనే భావనతో మెలగాలని చెప్పారు. ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించడం వలన కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని వివరించారు. ఈ సమావేశంలో పారిశ్రామిక వేత్తలు, తదితరులు పాల్గొన్నారు.