సుందరంగా ప్రభుత్వ పాఠశాలలు..


Ens Balu
3
Srikakulam
2020-10-23 23:07:28

శ్రీకాకుళంజిల్లాలో నాడు - నేడు కార్యక్రమంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోబోతున్నాయని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. నాడు – నేడు కార్యక్రమం పరిశీలనలో భాగంగా  జిల్లా కలెక్టర్ లావేరు మండలం తాళ్లవలస ఎం.పీ.పీ స్కూల్ ను శుక్రవారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను నిశితంగా పరిశీలించిన ఆయన  నాడు-నేడు పై  ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు, సిబ్బందికి టీచర్స్ కి పలు సూచనలు చేస్తూ,  సలహాలు ఇచ్చారు. అనంతరం తొమ్మిదో తరగతి చదివే విద్యార్థికి సోషల్ స్టడీస్  సబ్జెక్టుపై భూమి, భౌగోళం వంటి విషయాలపై విద్యార్థి పరిజ్ఞానం, చదవడాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పాఠశాలలోని  గ్రానైట్ పై  ఎటువంటి మరకలు ఉండరాదని, పుట్టి వర్క్ చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కిటికీ తలుపులను పరిశీలించిన ఆయన మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉండేందుకు పలు సూచనలు చేసారు.  అనంతరం ఎంపీడీవో ఆఫీస్ లోని గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాము ఇంజనీరింగ్ చదివే సమయంలో కార్పోరేట్ పాఠశాలలు, పేరుగాంచిన విశ్వవిద్యాలయాలు ఏ విధంగా ఉన్నాయో, నేడు  ప్రభుత్వ పాఠశాలలు ఆ విధంగా మారేవిధంగా  తీర్చిదిద్దుతామని సంకల్పించుకోవాలని ఇంజినీర్లకు సూచించారు. నిర్మాణపు పనులు జరుగుతున్న పనులను ఎప్పటికపుడు మోనటరింగ్ చేయాలని, అవసరమైన సలహాలు, సూచనలు  ఇవ్వాలని కలెక్టర్ కోరారు.  పాఠశాలలకు అవసరమైన ఎలక్ట్రికల్  కన్సీల్డ్ వర్క్ తో పాటు నిర్మాణపు పనుల్లో నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్ధులు ఆహ్లాదకరమైన వాతావరణంలో  ఉయ్యాల, జారుడు బల్ల వంటివి ఆడుకునే విధంగా ఆకర్షణీయమైన ఆట వస్తువులను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.  జిల్లాలోని డెమో స్కూల్స్ అయిన సింగుపురం, కింతలి, మురపాక పాఠశాలల్లో పాఠశాల కమిటీల ద్వారా ఏర్పాటుచేసిన  సంగతిని  తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ ఏ.పి.సి పైడి వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట కృష్ణయ్య, మండల తహశీల్ధారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిఎంఓ మోహన్ రావు, ఇతర సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.